BJP: బీజేపీ, ఆప్ మధ్య నార్కో టెస్టు సవాల్
- బీజేపీలో చేరమని సీబీఐ ఒత్తిడి తెచ్చిందన్న సిసోడియా
- నార్కో టెస్టుకు హాజరుకావాలని బీజేపీ డిమాండ్
- ప్రధాని మోదీనే నార్కో టెస్టు చేయించుకోవాలంటున్న ఆప్
- మనీష్ ఆరోపణలను ఖండించిన సీబీఐ
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని విడిచిపెట్టి బీజేపీలో చేరాలని సీబీఐ ఒత్తిడి తెచ్చిందన్న ఆరోపణలు నిరూపించేందుకు నార్కో టెస్టుకు హాజరుకావాలని లేదంటే బీజేపీ నాయకులు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సవాల్ విసిరారు. వీటిని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ప్రధాని మోదీకే నార్కో టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ, ఆయనను ఈ శతాబ్దపు అతిపెద్ద అబద్దాల కోరు అని విమర్శించింది. సిసోడియా నిజాయతీ గల నాయకుడైతే సీబీఐ అధికారులపై ఆరోపణలు చేసినందుకు నార్కో టెస్ట్‌కు అంగీకరించాలని లేదా రాజీనామా చేయాలని పశ్చిమ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ అన్నారు.
‘బీజేపీలో చేరమని సిసోడియాను ఎవరైనా సీబీఐ అధికారి అడిగితే ఆ అధికారి పేరు చెప్పాలి. కాదంటే నార్కో టెస్ట్‌కు సిద్ధపడాలి లేదా తన పదవికి రాజీనామా చేయాలి' అని వర్మ డిమాండ్ చేశారు. వర్మ వ్యాఖ్యలను మరో బీజేపీ నేత కపిల్ మిశ్రా కూడా సమర్థించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియా చేసిన ఆరోపణలను దర్యాప్తును ప్రభావితం చేయడానికి సిగ్గులేకుండా ప్రయత్నించారని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మిశ్రా అన్నారు.
ఈ విషయంలో బీజేపీపై ఎదురుదాడికి దిగిన ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ప్రధాని మోదీని సీరియల్ అబద్ధాల కోరు అని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకులందరిలో అత్యధికంగా అబద్ధాలు మాట్లాడే మోదీనే నార్కో పరీక్ష చేయించుకోవాలని భరద్వాజ్ అన్నారు. కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి సీబీఐ ప్రధాన కార్యాలయంలో సోమవారం సిసోడియాను తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నించారు. సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తరువాత, సిసోడియా మాట్లాడుతూ తాను ఆప్ నుంచి వైదొలగితే ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని పేర్కొన్నారు. కాగా, సిసోడియా ఆరోపణలను సీబీఐ తోసిపుచ్చింది.