Madhya Pradesh: హింసాకాండలో నష్టానికి రూ. 2.9 లక్షలు చెల్లించాలని 12 ఏళ్ల బాలుడికి నోటీసులు
- మధ్యప్రదేశ్ లో 8వ తరగతి చదువుతున్న బాలుడికి నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం
- రూ. 4.8 లక్షల జరిమానా కట్టాలని అతని తండ్రిని కోరిన ట్రైబ్యునల్
- ఏప్రిల్లో శ్రీరామ నవమి సందర్భంగా ఖార్గోవ్ జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
శ్రీరామ నవమి సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఖార్గోన్ జిల్లాలో చెలరేగిన హింసాకాండలో జరిగిన నష్టానికి గాను రూ.2.9 లక్షల జరిమానా చెల్లించాలంటూ ఎనిమిదో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలుడికి నోటీసులు జారీ అయ్యాయి. బాలుడి తండ్రి, కూలీ అయిన కలూ ఖాన్ను రూ. 4.8 లక్షల జరిమానా చెల్లించాలని ట్రైబ్యునల్ కోరింది. నిరసనలు, సమ్మెలు లేదా హింసాకాండ జరిగినప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు ఉద్దేశపూర్వకంగా నష్టం వాటిల్లితే నష్టపరిహారాన్ని రికవరీ చేయడానికి రాష్ట్రాన్ని అనుమతించే నష్టాల నివారణ, రికవరీ చట్టం కింద వీరికి నోటీసులు జారీ అయ్యాయి. ఖాన్ పొరుగువారి ఫిర్యాదు మేరకు సంబంధిత అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు.
ఏప్రిల్ 10న నగరంలో జరిగిన రామనవమి ఊరేగింపులో గుంపు దాడి చేయడంతో తన ఆస్తికి నష్టం జరిగిందని 12 ఏళ్ల బాలుడిపై ఫిర్యాదు చేస్తూ ఓ మహిళ ఆరోపించింది. అల్లర్ల సందర్భంగా కొంత మందితో కలిసి 12 ఏళ్ల బాలుడు తమ ఇళ్లను దోచుకుని ధ్వంసం చేశాడని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. అయితే, తన కొడుకు మైనర్ అని అల్లర్లు జరిగినప్పుడు తాము నిద్రపోతున్నామని అతని తండ్రి చెప్పాడు. తమకు న్యాయం కావాలని అంటున్నాడు. మైనర్ కు నోటీసులు జారీ చేయడంపై మజ్లిస్ అధినేత అసద్దుదీన్ స్పందించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ముస్లింలపై ఎంతో ద్వేషం ఉందని, పిల్లలను కూడా విడిచిపెట్టడం లేదని ఆరోపించారు.
కాగా, ఏప్రిల్ 10న ఖార్గోన్ జిల్లాలో రామనవమి ఊరేగింపుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వడంతో రెండు వర్గాల మధ్య భారీ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలు హింసకు దారితీశాయి. కాల్పులు, రాళ్లదాడి తర్వాత నగరంలో కర్ఫ్యూ విధించారు. మత ఘర్షణల తరువాత, 60కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. పోలీసులు 170 మందిపై కేసులు నమోదు చేశారు. రాష్ట్ర యంత్రాంగం 50కి పైగా ఇళ్లు, దుకాణాలు, భవనాలను కూల్చివేసింది.