green crackers: గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటో తెలుసా..? వీటి నుంచి కాలుష్యం వెలువడదా?
- సాధారణ ఫైర్ క్రాకర్స్ తో పోలిస్తే నయమే
- 30 శాతం తక్కువ వాయు, శబ్ద కాలుష్యం విడుదల
- విషపూరిత కెమికల్స్ లేకుండా తయారీ
ఢిల్లీ సర్కారు గ్రీన్ క్రాకర్స్ సహా అన్ని రకాల దీపావళి మందుగుండు సామగ్రి నిల్వ, విక్రయాలను 2023 జనవరి 1 వరకు నిషేధం విధించింది. దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని మాత్రం గ్రీన్ క్రాకర్స్ ను అనుమతించాయి. గ్రీన్ క్రాకర్స్ మాట ఎక్కువగా వినిపిస్తుండడంతో దీని పట్ల ప్రజల్లో ఆసక్తి ఏర్పడింది. పర్యావరణానికి హాని చేయనివి అనుకుంటున్నారు.
నిజానికి గ్రీన్ క్రాకర్స్ కాలుష్యాన్ని విడుదల చేయవని కావు. కాకపోతే సాధారణ ఫైర్ క్రాకర్స్ తో పోలిస్తే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. ఇందులో వాడే ముడి సరుకుల కారణంగా.. వీటిని కాల్చినప్పుడు వెలువడే దుమ్ము తక్కువగా ఉంటుంది. కొన్ని రకాల గ్రీన్ క్రాకర్స్ తయారీలో హానికారక కెమికల్స్ ను అసలే ఉపయోగించరు.
సాధారణ ఫైర్ క్రాకర్స్ తో పోలిస్తే గ్రీన్ క్రాకర్స్ లో విషపూరితమైన ఆర్సెనిక్, లిథియం, బేరియం ఉపయోగించరు. సాధారణ ఫైర్ క్రాకర్స్ ను కాల్చినప్పుడు 160 డెసిబుల్స్ శబ్దాలు వెలువడితే, గ్రీన్ క్రాకర్స్ లో శబ్ద స్థాయి 110-125 డెసిబుల్స్ గానే ఉంటుంది. సాధారణ క్రాకర్స్ తో పోలిస్తే 30 శాతం తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. కనుక గ్రీన్ క్రాకర్స్ తోనూ కాలుష్యం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాలతో వినికిడి శక్తి దెబ్బతింటుంది.
గ్రీన్ క్రాకర్స్ ను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధన ద్వారా అభివృద్ధి చేశాయి. గ్రీన్ క్రాకర్స్ తయారీ ఫార్ములాను ఎవరికీ వెల్లడించకూడదన్న షరతు మీద క్రాకర్స్ తయారీ కంపెనీలకు సీఎస్ఐఆర్-ఎన్ఈఈఆర్ఐ అందిస్తాయి. ఇందుకు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.