mobile Broadband: బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ లో పడిపోయిన భారత్ స్థానం
- మొబైల్, ఫిక్స్ డ్ బ్రాడ్ బ్యాండ్ వేగంలోనూ ఒక స్థానం కిందకు
- సెప్టెంబర్ నెల ఊక్లా స్పీడ్ టెస్ట్ గణాంకాల విడుదల
- మొదటి స్థానంలో చైనాలోని షాంఘై, బీజింగ్
మొబైల్ నెట్ వర్క్ స్పీడ్ లోనే కాదు.. ఫిక్స్ డ్ బ్రాడ్ బ్యాండ్ వేగంలోనూ భారత్ ర్యాంకు పడిపోయింది. ఆగస్ట్ నెలతో పోలిస్తే సెప్టెంబర్ లో డౌన్ లోడ్ వేగం కాస్తంత పెరిగినా, ర్యాంకు తగ్గడం గమనార్హం. సెప్టెంబర్ నెలకు సంబంధించి ‘ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్’ గణాంకాలు విడుదలయ్యాయి.
భారత్ స్థానం 118 నుంచి 117కు తగ్గింది. ఆగస్ట్ లో మొబైల్ బ్రాడ్ బ్యాండ్ డౌన్ లోడ్ స్పీడ్ 13.52 ఎంబీపీఎస్ గా ఉంటే, సెప్టెంబర్ లో ఇది 13.87 ఎంబీపీఎస్ కు పెరిగింది. ఫిక్స్ డ్ బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ లోనూ భారత్ 79వ ర్యాంకు నుంచి 78వ ర్యాంకుకు పరిమితమైంది. ఆగస్ట్ లో బ్రాడ్ బ్యాండ్ డౌన్ లోడ్ వేగం 48.29 ఎంబీపీఎస్ ఉంటే, సెప్టెంబర్ లో 48.59 ఎంబీపీఎస్ కు పెరిగింది.
రిలయన్స్ జియో 5జీ నెట్ వర్క్ ఢిల్లీలో 600 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ వేగాన్ని చూపించింది. ఎయిర్ టెల్ నెట్ వర్క్ లో 200 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ వేగం నమోదైంది. 158.63 ఎంబీపీఎస్ మొబైల్ నెట్ వర్క్ డౌన్ లోడ్ వేగంతో ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ లో, చైనాలోని షాంఘై పట్టణం అగ్ర స్థానంలో ఉంది. ఫిక్స్ డ్ బ్రాడ్ బ్యాండ్ లో 236.86 ఎంబీపీఎస్ వేగంతో బీజింగ్ మొదటి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా చూస్తే సగటు మొబైల్ డౌన్ లోడ్ వేగం 33.17 ఎంబీపీఎస్, అప్ లోడ్ వేగం 9.03 ఎంబీపీఎస్ గా ఉన్నాయి. ఫిక్స్ డ్ బ్రాడ్ బ్యాండ్ డౌన్ లోడ్ 71.41 ఎంబీపీఎస్, అప్ లోడ్ వేగం 30.65 ఎంబీపీఎస్ గా ఉన్నాయి.