KTR: మునుగోడు బీజేపీ నేతతో ఫోన్ లో మాట్లాడిన కేటీఆర్.. ఆడియో లీక్!

Audio of KTR speaking to Munugode BJP leader leaked

  • గట్టుప్పల్ బీజేపీ నేత జగన్నాథంకు కేటీఆర్ ఫోన్
  • టీఆర్ఎస్ గెలుపుకు సహకరించాలని కోరిన కేటీఆర్
  • మీ ఆశీర్వాదం కావాలన్న కేటీఆర్

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం అన్ని ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గానికి చెందిన ఒక బీజేపీ నేతతో మంత్రి కేటీఆర్ ఫోన్ లో మాట్లాడిన ఆడియో లీక్ కావడం సంచలనం రేపుతోంది. నియోజకవర్గంలోని గట్టుప్పల్ బీజేపీ ఇన్ఛార్జీగా వ్యవహరిస్తున్న జగన్నాథంకు కేటీఆర్ ఫోన్ చేశారు. టీఆర్ఎస్ గెలుపుకు సహకరించాలని కోరారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి తన కంటే మీకు ఎక్కువ తెలుసని...  కోమటిరెడ్డి నిజమైన బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్త కాదని ఫోన్ లో కేటీఆర్ అన్నారు. 

'రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చేది లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయేది లేదు. రాజగోపాల్ రెడ్డి గారి గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఆయన ఎన్నడైనా నియోజకవర్గాన్ని పట్టించుకున్నారా, ప్రజలను పట్టించుకున్నారా? మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాజగోపాల్ రెడ్డి పాత ఆరెస్సెస్ మనిషో, పూర్తి స్థాయి బీజేపీ మనిషో అయితే పర్వాలేదు. అవకాశవాదం కోసం పార్టీ మారాడే తప్ప... ఆయనకు మోదీ మీదో ఇంకెవరిమీదో ప్రేమ లేదు. 

గట్టుప్పల్ లో మీరు నాకు సహకరిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. నియోజకవర్గాన్ని కూడా దత్తత తీసుకుంటానని నేను చెప్పా. నేను పని చేసే మీ సహకారాన్ని అడుగుతున్నా. డొల్ల మాటలు చెప్పి అడగడం లేదు. దయచేసి నాకు మీ ఆశీర్వాదం కావాలి. మీరొక్కరు సహకరిస్తే చాలు. మా వాళ్లంతా మీకు చాలా ఇన్ ఫ్లూయెన్స్ ఉందని చెపుతున్నారు. మీ నియోజకవర్గంలో 79 వేల మందికి రైతుబంధు వస్తోంది. 43 వేల మందికి పెన్షన్లు వస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీలాంటి వాళ్లు ఆశీర్వదిస్తే ఇంకా ఎక్కువ పని చేయాలనిపిస్తుంది' అని కేటీఆర్ చెప్పారు. 

అయితే ఈ సందర్భంగా కేటీఆర్ మాటలకు అడ్డుతగిలిన జగన్నాథం... రైతు బంధుకు లిమిట్ ఉండాలని, చిన్న రైతులకే రైతుబంధు ఇవ్వాలని, వందల ఎకరాలు ఉన్నవాళ్లకు ఇస్తే పెద్దపెద్ద రైతులు, పెట్టుబడిదారులే బాగుపడతారని చెప్పారు. 

దీనికి సంబంధించిన వీడియోను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్విట్టర్ లో షేర్ చేశారు. నిరాశలో కూరుకుపోయిన ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ ఫోన్లు చేస్తూ విపక్ష నేతలను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News