YSRCP: రూంలో పెట్టి పిల్లిని కొడితేనే కళ్లు పీకుతుంది.. అదే పులిని కొడితే ఏమవుతుంది?: రఘురామకృష్ణరాజు
- ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన రఘురామరాజు
- పవన్ ను కెలికి మరీ వైసీపీ నేతలు తిట్టించుకున్నారని వ్యాఖ్య
- జగన్ ముత్తాత భార్యకు విడాకులివ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నారన్న ఎంపీ
- జగన్ సోదరి షర్మిల కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని కామెంట్
వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు, వాటిపై వైసీపీ నేతల వరుస ఎదురు దాడులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు బుధవారం స్పందించారు. ఈ మేరకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.
రూంలో పెట్టి పిల్లిని కొడితేనే కళ్లు పీకుతుంది.. అదే పులిని కొడితే ఏమవుతుంది? అంటూ ఆయన ఓ సామెతను ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ విషయంలో వైసీపీ అదే చేసిందని కూడా ఆయన ఆరోపించారు. పవన్ కల్యాణ్ ను అనవసరంగా కెలికిన వైసీపీ నేతలు ఆయనతో తిట్లు తిన్నారని అన్నారు. వరుసబెట్టి ఆరోపణలు గుప్పిస్తూ ఉంటే...ఎవరికైనా కోపం వస్తుందన్న రఘురామరాజు... పవన్ కూడా మనిషే కదా? అంటూ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసుకున్న 3 పెళ్లిళ్లను ప్రస్తావించిన రఘురామరాజు.. అది పవన్ వ్యక్తిగతమని అన్నారు. పవన్ 3 పెళ్లిళ్లు చేసుకున్నారని విమర్శిస్తున్న వైసీపీ నేతలు తమ పార్టీ అధినేత ఇంటిలో జరిగిన పెళ్లిళ్లపై ఎందుకు నోరిప్పరని ప్రశ్నించారు. జగన్ ముత్తాత వెంకటరెడ్డి తొలి భార్య బతికుండగానే... ఆమెకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారని గుర్తు చేశారు.
వెంకటరెడ్డి మాదిరిగా కాకుండా పవన్ విడాకులిచ్చాకే తదుపరి పెళ్లి చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా రెండు పెళిళ్లు చేసుకున్నారు కదా? అని ఆయన అన్నారు. తొలుత మేనమామతో పెళ్లి జరగగా... ఆ పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పిన షర్మిల... బ్రదర్ అనిల్ కుమార్ ను పెళ్లి చేసుకున్నారని ఆయన చెప్పారు. షర్మిల రెండు పెళ్లిళ్లు చేసుకున్నారేమిటని ఇప్పటిదాకా ఆమెను ఎవరూ ప్రశ్నించలేదు కదా? అని కూడా ఆయన అన్నారు.
జనసేన, వైసీపీల మధ్య మంగళవారం జరిగిన గొడవ నేపథ్యంలో ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రలోనూ పవన్ సినిమాలోని ఓ పాట మారుమోగిపోతోందని రఘురామకృష్ణరాజు తెలిపారు. గాల్లో తేలినట్టుందే... అంటూ ఆయన మీడియా సమావేశంలోనే పాట పాడారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానని పవన్ కల్యాణ్ అంటే... అవును మీరు ప్యాకేజీ స్టారే అని వైసీపీ నేతలు ఆయనను మరింతగా రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న సీఎం బాగానే ఉంటారని, అంతంత మాత్రంగా భద్రత కలిగిన మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.