Andhra Pradesh: సోము వీర్రాజుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కన్నా లక్ష్మీనారాయణ
- పార్టీని నడపడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందన్న కన్నా
- జనసేనను సమన్వయం చేసుకోవడంలోనూ విఫలమని వ్యాఖ్య
- ఇప్పుడు నిర్ణయాలన్నీ సోము వీర్రాజే తీసుకుంటున్నారని ఆరోపణ
- పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదని ఆవేదన
- అధినాయకత్వం జోక్యం చేసుకోవాలన్న మాజీ అధ్యక్షుడు
బీజేపీ ఏపీ శాఖలో తొలిసారి అసమ్మతి స్వరం వినిపించింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని నడిపే విషయంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తమతో పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయం చేసుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఆయన అన్నారు. ఈ భావన ఇప్పటిదాకా తన మనసులోనే ఉన్నదని, ఇప్పుడది బయటకు వచ్చిందని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పార్టీ అధినాయకత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా కన్నా వ్యాఖ్యానించారు.
అసలు పార్టీ రాష్ట్ర శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదని కూడా కన్నా అన్నారు. గతంలో తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి రెండు నెలలకు ఓ సారి కోర్ కమిటీ భేటీ ఏర్పాటు చేసుకుని ఆయా సమస్యలు, అంశాలపై చర్చించుకునే వారమని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పుడు సోము వీర్రాజు ఒక్కరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని, అసలు కోర్ కమిటీ సమావేశాలే జరగడం లేదన్నారు. ఫలితంగా పార్టీ రాష్ట్ర శాఖలో ఏం జరుగుతుందో పార్టీ నేతలకే తెలియడం లేదన్నారు. జనసేనతో పార్టీ కీలక నేత మురళీధరన్ సమన్వయం చేస్తారని తెలిసినా.. ఎందుకనో ఆ దిశగానూ అడుగులు పడలేదని కన్నా అన్నారు.