Andhra Pradesh: రక్షణ శాఖ కార్యదర్శిగా ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి గిరిధర్ నియామకం
- హైదరాబాద్, వరంగల్ లో విద్యాభ్యాసం చేసిన గిరిధర్
- 1988 బ్యాచ్ ఏపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి
- తొలి నాళ్లలో చిత్తూరు, ఖమ్మం జిల్లాల కలెక్టర్ గా విధులు
- ప్రస్తుతం కేంద్ర రవాణా శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న గిరిధర్
- ఈ నెల 31న రవాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ
ఏపీ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి గిరిధర్ కేంద్ర ప్రభుత్వంలో మరో కీలక పదవిని చేపట్టబోతున్నారు. 1988 బ్యాచ్ ఏపీ కేడర్ కు చెందిన గిరిధర్... చాలా కాలం క్రితమే కేంద్ర సర్వీసులకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర రవాణా శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన... తాజాగా రక్షణ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదంతో డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.
సివిల్ సర్వీసులకు ఎంపికైన గిరిధర్ తన వృత్తి జీవితాన్ని ఉమ్మడి ఏపీలో ప్రారంభించారు. చిత్తూరు, ఖమ్మం జిల్లాల కలెక్టర్ గా పనిచేసిన ఆయన ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాకుండా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గానూ ఆయన విధులు నిర్వర్తించారు. అనంతర కాలంలో ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు.
కేంద్రంలో తొలుత కేబినెట్ సెక్రటేరియట్ లో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత రవాణా శాఖ కార్యదర్శిగా బదిలీ అయిన ఆయన తాజాగా రక్షణ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ నెల 31న ప్రస్తుతం రక్షణ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న అజయ్ కుమార్ నుంచి గిరిధర్ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ జేఎన్టీయూలో బీటెక్ చేసిన గిరిధర్, ఐఐటీ మద్రాస్ నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. ఇక వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ కూడా పూర్తి చేశారు.