China: పాకిస్థాన్ ఉగ్రవాదులపై మరోమారు ప్రేమ కురిపించిన చైనా
- భారత్, అమెరికా ప్రతిపాదనకు చైనా అడ్డుపుల్ల
- లష్కరే ఉగ్రవాది షాహిద్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదనను మొన్న అడ్డుకున్న చైనా
- హఫీజ్ తల్హాను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చకుండా నిన్న అడ్డుకున్న వైనం
పాకిస్థాన్ ఉగ్రవాదుల విషయంలో అమితమైన ప్రేమ కురిపిస్తున్న చైనా మరోమారు అదే పని చేసింది. లష్కరే తోయిబా ఉగ్రవాది షాహిద్ మహమూద్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదనను అడ్డుకున్న చైనా.. ఆ తర్వాతి రోజే మరోమారు తన నైజాన్ని చాటిచెప్పింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీద్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలంటూ ఐక్యరాజ్య సమితిలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనకు చైనా అడ్డు తగలింది. ఆ ప్రతిపాదనను టెక్నికల్‌గా నిలుపుదల చేసింది.
పాకిస్థాన్ ఉగ్రవాదులను ప్రపంచ ఉగ్రవాదులుగా ప్రకటించాలంటూ భారత్, అమెరికా చేస్తున్న ప్రతిపాదనలను చైనా అడ్డుకోవడం రెండో రోజుల్లో రెండోసారి కావడం గమనార్హం. 1267 ఆల్‌ఖైదా ఆంక్షల కమిటీ కింద షాహిద్ మహమూద్ (42)ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా మొన్న అడ్డుకుంది.
చైనా ఇలా అడ్డుకోవడం నాలుగు నెలల్లో ఐదోసారి కావడం గమనార్హం. 26/11 ముంబై దాడుల్లో హఫీజ్ తల్హా సయీద్ కీలక పాత్రధారి. తల్హాను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఏప్రిల్ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉగ్రవాదుల రిక్రూట్మెంట్, నిధుల సేకరణ, లష్కరే తోయిబా దాడుల ప్రణాళిక, అమలులో చురుగ్గా ఉన్నట్టు అందులో పేర్కొంది.