Maharashtra: శరద్ పవార్ తో ఒకే వేదికపై 'మహా' సీఎం షిండే
- కొందరికి నిద్రలేని రాత్రులేనని సీఎం కామెంట్
- ముంబై క్రికెట్ అసోసియేషన్ విందులో పాల్గొన్న నేతలు
- ఎంసీఏను కొత్త తీరాలకు తీసుకెళ్లాలని షిండే ఆకాంక్ష
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ లు ఒకే వేదిక పంచుకున్నారు. ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు కలుసుకున్నారు. శివసేన పార్టీ విషయంలో ఉద్ధవ్ థాకరే, ఏక్ నాథ్ షిండేల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో థాకరే కూటమిలోని ఎన్సీపీ చీఫ్ పవార్, ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఒకే కార్యక్రమంలో పాల్గొనడం, ఒకే వేదికపై కూర్చోవడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. దీనిని ఉద్దేశించి ముఖ్యమంత్రి షిండే ట్వీట్ చేశారు. తనతోపాటు దేవేంద్ర ఫడ్నవీస్, శరద్ పవార్ ను ఒకే వేదికపై చూసి రాష్ట్రంలో చాలామంది రాత్రుళ్లు నిద్రకు దూరమవుతారని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం రాత్రి అసోసియేషన్ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్యమంత్రితో పాటు అసోసియేషన్ బోర్డు మాజీ సభ్యులను ఇతర పెద్దలను ఆహ్వానించింది. షిండేతో పాటు అధికార పక్షానికి చెందిన బీజేపీ నేత ఫడ్నవీస్, ప్రతిపక్ష నేత శరద్ పవార్ సహా పలువురు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడారు. తర్వాత ఎంసీఏ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. కార్యక్రమం తర్వాత.. పార్టీలు వేరైనా తమందరికీ క్రికెట్ అంటే ఆసక్తి అని, ఎంసీఏను కొత్త తీరాలకు చేర్చేందుకు పార్టీలకతీతంగా ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి షిండే ట్వీట్ చేశారు.