mosquitos: దోమలు మనలో కొందరినే ఎక్కువ కుడుతుంటాయి ఎందుకని?
- చర్మం నుంచి విడుదలయ్యే ప్రత్యేక వాసనే దీనికి కారణం
- కార్బోక్సిలిక్ యాసిడ్స్ అధికంగా విడుదలయ్యే వారి చెంతకు దోమలు
- నూతన పరిశోధనలో వెల్లడైన విషయం
దోమలు మనలో కొందరినే ఎక్కువగా కుడుతుంటాయి? ఎందుకన్నది ఎవరికీ తెలియదు. ఫలానా రక్తం ఉన్న వారు, బ్లడ్ షుగర్ ఉన్నవారు, వెల్లుల్లి లేదా అరటి పండ్లను తినే వారిని, మహిళలను ఎక్కువగా కుడతాయన్న అపోహలు ఉన్నాయి. కానీ అసలు కారణం ఇవి కాదని తెలిసింది. మన చర్మం నుంచి వెలువడే ఓ తరహా వాసన దోమలను ఆకర్షిస్తుందని నూతన పరిశోధనలో తేలింది. ఈ ఫలితాలు జర్నల్ సెల్ లో ప్రచురితమయ్యాయి.
చర్మంపై కార్బోక్సిలిక్ యాసిడ్స్ స్థాయులు అధికంగా ఉన్న వారికి దోమలు ఎక్కువగా ఆకర్షితమవుతాయని ఈ పరిశోధన తేల్చింది. చర్మంపై ఈ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండడానికి, దోమలు ఆకర్షించడానికి మధ్య బలమైన బంధం ఉందని రాక్ ఫెల్లర్ లేబరేటరీ ఆఫ్ న్యూరోజెనెటిక్స్ అండ్ బిహేవియర్ హెడ్ లెస్ట్ లీ వోషాల్ పేర్కొన్నారు.
పరిశోధకులు మూడేళ్ల పాటు దీనిపై అధ్యయనం చేశారు. చర్మంపై సెబమ్ లో 50 రకాల మాలెక్యులర్ కాంపౌండ్లను గుర్తించి, విశ్లేషించే ప్రయత్నం చేశారు. దోమలు ఎక్కువగా ఆకర్షితులైన వారికి కార్బోక్సిలిక్ యాసిడ్స్ ఎక్కువగా విడుదలైనట్టు తెలుసుకున్నారు. చర్మంపై సహజ మాయిశ్చరైజర్ లేయర్ లో కార్బోక్సిలిక్ యాసిడ్స్ భాగం. ఒక్కొక్కరి శరీరం ఒక్కో విధంగా దీన్ని విడుదల చేస్తుంటుంది.