Munugode: మునుగోడు రిటర్నింగ్ అధికారిపై వేటు వేసిన ఎన్నికల సంఘం
- యుగ తులసి పార్టీ అభ్యర్థికి కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తు మార్పు
- ఈ పరిణామంపై రిటర్నింగ్ అధికారి వివరణ కోరిన ఈసీ
- తాజాగా శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తును పునరుద్ధరించిన వైనం
- కొత్త రిటర్నింగ్ అధికారి కొరకు ముగ్గురి పేర్లను సూచించాలని సీఈఓకు ఆదేశం
మునుగోడు ఉప ఎన్నికలో గుర్తులకు సంబంధించి రేకెత్తిన వివాదంలో రిటర్నింగ్ అధికారిపై వేటు పడింది. ఉప ఎన్నికల్లో ఒకసారి ఆయా పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన తర్వాత వాటిని మార్చడం దాదాపుగా కుదరదు. ఒకవేళ అలా మార్చాలంటే కేంద్ర ఎన్నికల సంఘానికి సదరు అంశాన్ని నివేదించి సంఘం అనుమతితో రిటర్నింగ్ అధికారి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఇలాంటిదేమీ లేకుండానే మునుగోడు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి... యుగ తులసి పార్టీకి కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును మార్చి.. దాని స్థానంలో బేబీ వాకర్ గుర్తును కేటాయించారు. ఈ విషయంపై ఈసీకి యుగ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ ఫిర్యాదు చేశారు.