CChiranjeevi: మొగల్తూరులో గ్రంథాలయానికి ఇవ్వకుండా చిరంజీవి తన ఇంటిని అమ్మేసుకున్నారనేది అబద్ధం: సీనియర్ జర్నలిస్ట్ ప్రభు
- చిరంజీవికి మొగల్తూరులో ఇల్లు లేదు
- అక్కడ ఉన్నది ఆయన తాతగారి ఇల్లు
- దానితో మెగాస్టార్ కి సంబంధమే లేదు
- అది ఆయన అమ్ముకున్నాడనడం దారుణం
- పుకార్లపై స్పందించిన జర్నలిస్ట్ ప్రభు
మొగల్తూరులోని చిరంజీవి సొంత ఇంటిని అక్కడి గ్రామస్తులు గ్రంథాలయం కోసం ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా కేవలం 3 లక్షలకు దానిని ఆయన అమ్మేశారనే ఒక ప్రచారం ఉంది. ఇందులో ఎంతవరకూ నిజం ఉందనే ప్రశ్న సుమన్ టీవీ ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ ప్రభుకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ప్రజారాజ్యం పార్టీ ప్రటకటనకి .. ఎన్నికలకి మధ్యలో ఈ ప్రచారం జరిగింది. 'ప్రజారాజ్యం' పార్టీపై బురదజల్లడానికి జరిగిన ప్రయత్నంలో బాగా సక్సెస్ అయినటువంటి ఈవెంట్ ఇది" అన్నారు.
"నిజానికి 'మొగల్తూరు'లో చిరంజీవిగారికి ఎలాటి ఇల్లూ లేదు .. ఎలాంటి స్థలమూ లేదు. మొగల్తూరు అనేది ఆయన పుట్టిన ఊరు మాత్రమే. వాళ్ల నాన్నగారు ఉద్యోగ రీత్యా అనేక ప్రాంతాలలో పనిచేస్తూ వచ్చారు. అలా తిరుగుతూ ఉండటం వలన వాళ్లకి ఒక స్థిరమైన ఇల్లు అనేది ఉండేది కాదు. మొగల్తూరులో ఉన్నది చిరంజీవిగారి తాతగారి ఇల్లు. చిరంజీవిగారు రాజకీయాల్లోకి రావడానికి పూర్వమే ఆ ఇంటిని వాళ్లు అమ్మేసుకోవడం జరిగింది. దాంతో చిరంజీవిగారికి ఎలాంటి సంబంధం లేదు" అని చెప్పారు.
"చిరంవిగారిది కాని ఒక ఇల్లు ఆయనదని పుట్టించి .. 3 లక్షలకి ఆశపడి అమ్మేశారనే ఒక వదంతిని లేవదీశారు. మొదటి నుంచి కూడా చిరంజీవిగారు తన స్థాయికి తగని విషయాలను పట్టించుకోరు. ఇలాంటి ప్రచారాలను ఖండించే ప్రయత్నం చేయరు. అందువలన ఈ ప్రచారం అలా కొనసాగుతూనే వచ్చింది. అందులో ఆ రోజున ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చిరంజీవి ఈ విషయంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కొసమెరుపు ఏమిటంటే 1998 నాటికే చిరంజీవిగారి పేరు మీద మొగల్తూరులో గ్రంథాలయం ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.