Sunil Gavaskar: ఆ ఇద్దరినీ తుది జట్టులో ఆడించాలి: గవాస్కర్
- ఆస్ట్రేలియా గడ్డపై టీ20 వరల్డ్ కప్
- ఈ నెల 23న భారత్ వర్సెస్ పాకిస్థాన్
- అందరి దృష్టి ఈ మ్యాచ్ పైనే!
- టీమిండియా కూర్పుపై అభిప్రాయాలు వెల్లడించిన గవాస్కర్
దాయాదులు భారత్, పాకిస్థాన్ ఈనెల 23న టీ20 వరల్డ్ కప్ లో తలపడనుండగా, మ్యాచ్ పై భారీ హైప్ నెలకొంది. చిరకాల ప్రత్యర్థులుగా పేరుగాంచిన ఈ రెండు జట్లు ప్రపంచంలో ఎక్కడ తలపడినా స్టేడియంలు నిండిపోవడం గ్యారంటీ. ఈ మ్యాచ్ నేపథ్యంలో, మాజీ క్రికెటర్లు, క్రికెట్ పండితులు తమ విశ్లేషణలతో మీడియాను, సోషల్ మీడియాను నింపేస్తున్నారు.
ఇక అసలు విషయానికొస్తే, ఈ మెగా ఈవెంట్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ ద్వారా టీమిండియా తన ప్రస్థానాన్ని ఆరంభించనుండగా, బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ జట్టు కూర్పుపై స్పందించారు.
టీమిండియా తుదిజట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్లు రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ ఇద్దరినీ ఆడించాలని సలహా ఇచ్చారు. అదే సమయంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఐదో బౌలర్ గా ఉపయోగించుకోవాలని సూచించారు. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్ లో పాండ్యా సహా ఆరుగురు బౌలర్లను ఆడించాలని భావిస్తే మాత్రం పంత్ కు తుదిజట్టులో చోటు కష్టమేనని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
టీమిండియా ఐదుగురు బౌలర్ల ఫార్ములాకు కట్టుబడితే, పంత్ కు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. పంత్ ఆరోస్థానంలో బ్యాటింగ్ కు దిగితే, దినేశ్ కార్తీక్ ఏడో స్థానంలో బ్యాటింగ్ కు రావొచ్చని వివరించారు. మిడిలార్డర్ లో ఓ ఎడమచేతివాటం బాట్స్ మన్ ఉండడం జట్టుకు మేలు చేస్తుందని అన్నారు.
అయితే, మ్యాచ్ లో మూడు, నాలుగు ఓవర్లు మిగిలున్నప్పుడు పంత్ లేదా కార్తీక్ లలో ఎవరు బెటర్? అన్న చర్చ జరుగుతోందని, అయితే, ఎవరు మెరుగైన ఆప్షన్ అనేది మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుందని సన్నీ స్పష్టం చేశారు