Russia: లిజ్ ట్రస్ రాజీనామాపై రష్యా సెటైర్లు!
- ఇంతటి అపకీర్తి కలిగిన ప్రధానిని బ్రిటన్ ఎన్నడూ చూడలేదన్న రష్యా
- గతంలో రష్యాలో పర్యటించినప్పుడు ప్రాంతాల విషయంలో తడబడిన ట్రస్
- అప్పట్లో రష్యన్ మీడియాలో ట్రస్‌పై విమర్శలు
బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కూడా కాకముందే లిజ్ ట్రస్ రాజీనామా చేయడంపై రష్యా విమర్శలతో విరుచుకుపడింది. విపత్కర పరిస్థితులను అంచనా వేయడంలో ట్రస్ విఫలమయ్యారని పేర్కొన్న రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా.. ఇంతటి అపకీర్తి కలిగిన వ్యక్తిని ప్రధానిగా బ్రిటన్ ఎన్నడూ చూడలేదన్నారు. ఎస్తోనియాలో గతేడాది బ్రిటన్ సైన్యాన్ని కలిసినప్పుడు ఫ్లాక్ జాకెట్, హెల్మెట్ ధరించి లిజ్ ఫొటోషూట్ చేశారని ఎగతాళి చేశారు.
అప్పట్లో విదేశాంగ మంత్రిగా ఉన్న ట్రస్ రష్యాలో పర్యటించారు. ఆ సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రష్యాకు చెందిన ప్రాంతాల విషయంలో తడబడడంపై రష్యన్ మీడియా విమర్శలు కురిపించింది. అప్పటి నుంచి ఆమెను లక్ష్యంగా చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు రష్యాకు మరో అవకాశం చిక్కింది.
బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టిన తర్వాతి రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కన్జర్వేటరీ పార్టీ నాయకులు మాత్రమే ఆమెను నాయకురాలిగా ఎన్నుకున్నారని, దేశ ప్రజలు కాదని అన్నారు.