Revanth Reddy: పీసీసీ అధ్యక్ష పదవి నుంచి నన్ను సాగనంపే కుట్ర జరుగుతోంది: రేవంత్‌రెడ్డి
- టీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్న రేవంత్ రెడ్డి
- తాను బలహీన పడ్డానని చూపించాలని తాపత్రయ పడుతున్నాయన్న పీసీసీ చీఫ్
- సుపారీ కిల్లింగ్ ఒప్పందాలతో కాంగ్రెస్‌ను చంపాలనుకుంటున్నారని ఆరోపణ
- 26, 27లలో చండూరులో దీక్ష చేస్తానన్న రేవంత్
తనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నిన్న మునుగోడులో విలేకరులతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వలేదని చూపించేందుకు టీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయన్నారు. ఫలితంగా తాను బలహీనపడ్డానని చూపించడం ద్వారా పీసీసీ అధ్యక్ష పదవి నుంచి సాగనంపేందుకు పన్నాగాలు పన్నుతున్నారని అన్నారు. అలాంటి వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని, ప్రశాంత్ కిశోర్ వ్యూహ రచనలో ముందుకు సాగుతున్నాయని విమర్శించారు. సుపారీ కిల్లింగ్ ఒప్పందాలు చేసుకుని కాంగ్రెస్‌ను చంపాలని చూస్తున్నారని అన్నారు.
చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పండి
కాంగ్రెస్‌ను చంపేందుకు ఆ రెండు పార్టీలు చేయని ప్రయత్నాలంటూ లేవని, మునుగోడులో డబ్బు, మద్యం పంపకం ద్వారా ఓట్లు సాధించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్‌రెడ్డి, ఇలాంటి వారికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలని ప్రజలను కోరారు. మునుగోడు సమస్యల పరిష్కారానికి ఈ నెల 26, 27 తేదీల్లో చండూరులో దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. అనుమతి కోసం ఎన్నికల కమిషన్‌ను కోరతానన్నారు.
మద్యం పంచకుండా గెలవగలరా?
బ్యాలెట్ పేపర్‌లో టీఆర్ఎస్ రెండో స్థానంలో ఉండడంపై అభ్యంతరం తెలిపిన రేవంత్.. జాతీయ పార్టీలు మాత్రమే బ్యాలెట్ పేపర్‌లో ముందుండాలని అన్నారు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ వాహనాలను ఉపయోగిస్తూ ప్రచారం చేస్తున్నారని, వాటిని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నిక సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో విధుల్లో ఉన్న పోలీసుల వివరాలను డీజీపీ ప్రకటించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడులో మద్యం పంపిణీ చేయకుండా గెలిచే దమ్ము టీఆర్ఎస్, బీజేపీకి ఉందా? అని సవాలు విసిరారు.
రాజగోపాల్‌రెడ్డి బొడ్డులో కత్తి
కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతితో కలిసి గత రాత్రి మర్రిగూడ మండలంలో రోడ్‌షో నిర్వహించిన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలను ఫిరాయించే రాజగోపాల్‌రెడ్డి లాంటి దొంగలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని చంపేందుకు రాజగోపాల్‌రెడ్డి బొడ్డులో కత్తి పెట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. మునుగోడులో పార్టీని కాపాడుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరూ తరలిరావాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.