jihad: శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి జిహాద్‌పై పాఠాలు చెప్పాడంటూ కాంగ్రెస్ నేత శివరాజ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు
- జిహాద్ భావన గీతలో ప్రస్తావించారన్న కాంగ్రెస్ సీనియర్ నేత
- తీవ్రంగా స్పందించిన బీజేపీ
- కాంగ్రెస్ హిందూ ద్వేషి అని విమర్శించిన బీజేపీ నేత షెషజాద్
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ జిహాద్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. జిహాద్ భావన గీతలో ప్రస్తావించబడిందని, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జిహాద్‌పై పాఠాలు చెప్పాడని ఆయన అన్నారు. కాంగ్రెస్ సీనియర్, కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ జీవిత చరిత్ర ఆవిష్కరణ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ.. ‘ఇస్లాం మతంలో జిహాద్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరైనా స్వచ్ఛమైన ఆలోచనను అర్థం చేసుకోకపోతేనే బలాన్ని ఉపయోగించాలి. ఇది ఖురాన్ తో పాటు గీతలో ప్రస్తావించబడింది’ అని ఆయన పేర్కొన్నారు. శివరాజ్ పాటిల్ 2004 నుంచి 2008 వరకు కేంద్ర హోం మంత్రిగా, 1991 నుంచి 1996 వరకు లోక్‌సభ స్పీకర్‌గా పని చేశారు.
కాగా, శివరాజ్ జిహాద్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా ప్రతి స్పందించింది. బీజేపీ ప్రతినిధి షెహజాద్ జైహింద్ కాంగ్రెస్‌ను హిందూ ద్వేషి అని ఆరోపించారు. రాముడి ఉనికిని వ్యతిరేకిస్తోందన్నారు.
‘ఆప్‌కి చెందిన గోపాల్ ఇటాలియా, రాజేంద్ర పాల్ తర్వాత శ్రీ కృష్ణుడు అర్జునుడికి జిహాద్ నేర్పించాడని కాంగ్రెస్ శివరాజ్ పాటిల్ చెబుతున్నారు. గతంలో రాహుల్ గాంధీ కూడా హిందుత్వం గురించి మాట్లాడుతూ హిందూ సమూహాల కంటే ఎల్ఈటీ తక్కువ ప్రమాదకరమైనదన్నారు. దిగ్విజయ్ సింగ్ 26/11 ఉగ్రదాడుల విషయంలో హిందువులను నిందించారు’ అని షెహజాద్ కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.