tomatoes: టమాటాలను ట్రక్కుల్లోకి ఇలా లోడ్ చేస్తారా..?.. వీడియో వైరల్
- వేగంగా, సునాయాసంగా లోడ్ చేస్తున్న వ్యక్తి
- టమాటాలు ట్రక్కులో పడి, ఖాళీ బుట్టలు నేలపైకి
- నాలుగు రోజుల్లోనే కోటి మంది వీక్షణ
నిత్యం చేసే పని. వృత్తిలో భాగం. అటువంటి పని వేగం, టెక్నిక్ తో కూడుకుంటే దానికి తిరుగే ఉండదు. ఇక్కడ ఓ రైతు కూలీ చేస్తున్నది కూడా ఇదే. ట్రక్కులోకి టమాటాలను ఎంతో వేగంగా, సునాయాసంగా, వినూత్న టెక్నిక్ తో లోడ్ చేస్తుండడాన్ని చూడొచ్చు. ఈ వీడియోను ట్విట్టర్ లో ఒకరు పోస్ట్ చేయగా, పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. వాస్తవానికి ఇది టిక్ టాక్ లో చేసిన వీడియో. కనుక పాత వీడియో అని తెలుస్తోంది. కాకపోతే తాజాగా పలు సామాజిక మాధ్యమాల్లో ఇది పెద్ద ఎత్తున తిరుగుతోంది.
అద్భుతమైన నైపుణ్యంతో టమాటాలను లోడ్ చేస్తున్నాడంటూ ప్రతీక్ జైన్ అనే వ్యక్తి వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందులో ఏమైనా ఇంజనీరింగ్ ఉందంటారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. పొలంలో కూలీలు టమాటాలు తెంపి వాటిని వెదురు బుట్టల్లో నింపి పెడుతున్నారు. ఒక్కో బుట్టను రెండు చేతులతో బలంగా పైకి లేపి ఆ వ్యక్తి పైకి విసురుతున్నాడు. దీంతో టమాటాలు ట్రక్కులో పడి, ఖాళీ బుట్ట వ్యక్తి ముందు భాగంలో పడిపోతోంది. నిజంగా ఇది ఇంజనీరింగ్ టెక్నిక్ తో కూడినదే. అక్టోబర్ 18న ఈ వీడియోను పోస్ట్ చేయగా, ఇప్పటికి కోటి సార్లకు పైగా నెటిజన్లు వీక్షించారు.