YS Sharmila: వివేకా హత్య మా కుటుంబంలో జరిగిన ఘోరం: వైఎస్ షర్మిల
- తన చిన్నాన్నను ఎవరు హత్య చేశారో తెలియాలన్న వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు
- ఈ కేసు దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని వ్యాఖ్య
- సునీతా రెడ్డికి న్యాయం జరగాలన్న షర్మిల
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తన చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య తమ కుటుంబంలో జరిగిన ఘోరమైన ఘటన అని అన్నారు. వివేకా కుమార్తె సునీతా రెడ్డికి న్యాయం జరగాలన్నారు. సునీత కోరినట్టుగా ఈ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న షర్మిల.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాగ్ కు పిర్యాదు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. వివేకా హత్య కేసు విషయమై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తమ చిన్నాన్నను అంత ఘోరంగా ఎవరు హ్యత్య చేశారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. వివేకా హత్య వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది సీబీఐ దర్యాప్తులో తేలిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ హత్య కేసు దర్యాప్తును ఎవ్వరూ అడ్డుకోవడానికి వీల్లేదని షర్మిల స్పష్టం చేశారు.