Janasena: 9 మంది జనసేన నేతలకు బెయిల్... హైకోర్టు తీర్పుపై పవన్ కల్యాణ్ హర్షం
- విశాఖ ఎయిర్ పోర్టు వద్ద మంత్రులు, వైసీపీ నేతపై దాడి
- ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్న 9 మందికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు
- ప్రభుత్వం తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టిందన్న పవన్
- న్యాయ వ్యవస్థపై తనకు విశ్వాసం ఉందని వ్యాఖ్య
విశాఖ విమానాశ్రయంలో ఏపీ మంత్రులు, వైసీపీ నేతపై జరిగిన దాడి ఘటనలో అరెస్టైన జనసేనకు చెందిన 9 మంది నేతలకు బెయిల్ లభించింది. జనసేన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు... 9 మంది నేతలకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో పోలీసులు మొత్తంగా 70 మందిని అరెస్ట్ చేయగా... వారిలో 61 మందికి స్థానిక కోర్టే బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన 9 మందిపై మోపిన అభియోగాలు తీవ్రమైనవి కావడంతో వారికి బెయిల్ లభించలేదు.
తాజాగా 9 మంది జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించగా... వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం విశాఖ జైల్లో ఉన్న జనసేన నేతలు కోర్టు ఆదేశాలు అందగానే విడుదల కానున్నారు. ఇదిలా ఉంటే... జనసేన నేతలకు బెయిల్ లభించడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జనసేన నేతలపై ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని ఆయన ఆరోపించారు. నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరం అని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థను తానెప్పుడూ సంపూర్ణంగా విశ్వసిస్తానన్నారు.