KA Paul: మునుగోడులో గెలిచేది నేనే: కేఏ పాల్
- గెలిచిన ఆరు నెలల్లోనే యూనివర్శిటీ, కాలేజ్, హాస్పిటల్ కట్టిస్తానన్న పాల్
- మండలానికి వెయ్యి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ
- 27 మంది అభ్యర్థులు తనకు మద్దతు పలుకుతున్నారని వెల్లడి
మునుగోడు ఉప ఎన్నికలో తనదే గెలుపని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీ మూడు ప్రధాన పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికే టికెట్లు ఇచ్చాయని... ఇతర సామాజికవర్గాలను పట్టించుకోలేదని విమర్శించారు. తాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసినప్పుడు కూడా ఆయన అనుచరులు జై కేఏ పాల్ అన్నారని చెప్పారు. ఉంగరం గుర్తుకే మన ఓటు అంటూ మునుగోడు ప్రజలు నినదిస్తున్నారని అన్నారు.
ఇక తాను గెలిచిన ఆరు నెలల్లోనే ఒక యూనివర్శిటీ, ఒక కాలేజీ, ఒక హాస్పిటల్ కట్టిస్తానని చెప్పారు. మండలానికి వెయ్యి ఉద్యోగాలను ఇప్పిస్తానని తెలిపారు. తమకున్న హెలికాప్టర్ గుర్తు ఎవరికో ఇచ్చారని... అందుకే రిటర్నింగ్ ఆఫీసర్ ను తాను శపించానని, దీంతో, ఆయనపై వేటు వేశారని చెప్పారు.
మునుగోడులో పోటీ చేస్తున్న 27 మంది అభ్యర్థులు తనకు పూర్తి మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు డిపాజిట్ రాదని ఇప్పటికే తేలిపోయిందని... బీజేపీకి, టీఆర్ఎస్ కు డిపాజిట్లు వస్తాయా, లేదా అనే విషయం త్వరలోనే తేలుతుందని చెప్పారు. బడుగు, బలహీనవర్గాల ప్రజల మద్దతు తనకే ఉందని తెలిపారు. మునుగోడు ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తానని చెప్పారు.