Supreme Court: విద్వేష ప్రసంగాలపై సుమోటోగా స్పందించండి... ప్రభుత్వాలకు, పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
- దేశంలో విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఆందోళన
- ఫిర్యాదులు వచ్చేవరకు ఆగొద్దని ఆదేశాలు
- దేశంలో లౌకికవాద భావనను కాపాడాలని స్పష్టీకరణ
- ఆ దిశగా చర్యలు తప్పనిసరి అని వెల్లడి
దేశంలో విద్వేష ప్రసంగాల ఘటనలు పెరిగిపోతుండడం పట్ల అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్వేష ప్రసంగాలపై ఫిర్యాదులు వచ్చే వరకు వేచి చూడకుండా, సుమోటోగా స్పందించి కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాలకు, పోలీసులకు దిశానిర్దేశం చేసింది.
దేశంలో లౌకికవాద భావనను పరిరక్షించాలంటే ఇలాంటి చర్యలు తప్పనిసరి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తరచుగా విద్వేష ప్రసంగాలు చోటుచేసుకుంటుండడం దురదృష్టకరమని పేర్కొంది. శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని రాజ్యంగం చెబుతోందని, కానీ మతం పేరుతో విద్వేష ప్రసంగాలు వెలువరిస్తుండడం బాధాకరమని సుప్రీం ధర్మాసనం వివరించింది.
విద్వేష ప్రసంగాలను అడ్డుకోవాలంటూ దాఖలైన ఓ కేసు విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. అంతేకాదు, ఈ కేసుకు సంబంధించి... బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ తదితరులు ఓ వర్గానికి వ్యతిరేకంగా చేసిన విద్వేష ప్రసంగంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ఢిల్లీ పోలీసులను నివేదిక కోరింది.