Andhra Pradesh: ఏపీ రాజధాని అమరావతిపై నవంబర్ 1న సుప్రీంకోర్టులో విచారణ

supreme court will hear ap government petition on amaravati

  • ఏపీకి అమరావతే రాజధాని అంటూ తీర్పు ఇచ్చిన హైకోర్టు
  • హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • తమ పిటిషన్ పై త్వరితగతిన విచారణ చేపట్టాలంటూ సీజేఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
  • సీజేఐ ఆదేశాలతో పిటిషన్ ను లిస్ట్ చేసిన కోర్టు రిజిస్ట్రీ

ఏపీ రాజదాని అమరావతికి సంబంధించిన వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. నవంబర్ 1న అమరావతిపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణను చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఆదేశాల మేరకు అమరావతిపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను నవంబర్ 1న లిస్ట్ చేస్తూ కోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. 

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఇటీవలే ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 6 నెలల్లోగా అమరావతిని అభివృద్ధి చేసి తీరాలని కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును గత నెలలో ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై త్వరితగతిన విచారణ జరిగేలా చూడాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సీజేఐ జస్టిస్ లలిత్ కు లేఖ కూడా రాసింది. ఈ క్రమంలోనే ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణకు అనుమతి మంజూరు చేయడంతో పాటుగా విచారణ తేదీని కూడా ప్రకటించింది. ఈ పిటిషన్ పై జరిగే విచారణలో తమ వాదనలు కూడా వినాలని రాజధాని రైతులు కేవియట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News