Komatireddy Venkat Reddy: నేను ప్రచారం చేసినా వేస్టే.. మునుగోడులో కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదు: ఆస్ట్రేలియాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆస్ట్రేలియాకు వెళ్లిన కోమటిరెడ్డి
- తాను ప్రచారం చేసినా 10 వేల ఓట్లు మాత్రమే వస్తాయని వ్యాఖ్య
- కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా బలహీనంగా ఉందన్న కోమటిరెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. పార్టీలకు అతీతంగా అందరూ బీజేపీకి ఓటు వేయాలంటూ కాంగ్రెస్ నేతలకు ఆయన చేసిన ఫోన్ కాల్స్ లీక్ అయిన సంగతి తెలిసిందే. తాను రాష్ట్రమంతటా పర్యటిస్తానని... పీసీసీ ప్రెసిడెంట్ అవుతానని... అప్పుడు అందరినీ తాను చూసుకుంటానని ఆయన అన్నట్టు ఆడియోలో ఉంది. దీంతో, కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేగింది. మరోవైపు ఈరోజు వరకు ఆయన మునుగోడులో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయకుండా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు.
ఆస్ట్రేలియాలో తన అభిమానులతో ఆయన మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను మునుగోడులో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినా ఉపయోగం ఉండదని... మహా అయితే 10 వేల ఓట్లు వస్తాయని ఆయన అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేనే లేదని చెప్పారు. ఓడిపోయే పార్టీకి ప్రచారం చేయడమెందుకని ప్రశ్నించారు. మునుగోడులో తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి (బీజేపీ) గెలవబోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫైనాన్సియల్ గా చాలా బలహీనంగా ఉందని... తాను మునుగోడులో ప్రచారానికి వెళ్తే ఖర్చులు ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని... ఇక చాలని అన్నారు. కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.