currency notes: కరెన్సీ నోట్లపై గాంధీ స్థానంలో నేతాజీ బొమ్మ: హిందూ సంస్థ డిమాండ్
- స్వాతంత్య్ర సాధనలో నేతాజీ పాత్ర తక్కువేమీ కాదు
- గొప్ప పోరాట యోధుడిని గౌరవించే మార్గం ఇదే
- అఖిల భారత హిందూ మహాసభ
కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీకి బదులు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఫొటోను ముద్రించాలంటూ అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్ఎం) డిమాండ్ చేసింది. స్వాతంత్య్ర సాధన పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందించిన సేవలు, మహాత్మాగాంధీ కంటే ఎంత మాత్రం తక్కువ కాదని పేర్కొంది.
‘‘దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి నేతాజీ అందించిన సేవలు మహాత్మాగాంధీ కంటే ఏ మాత్రం తక్కువ కాదని మా అభిప్రాయం. కనుక భారతదేశ గొప్ప స్వాతంత్య్ర పోరాట యోధుడైన నేతాజీని గౌరవించేందుకు గొప్ప మార్గం.. కరెన్సీ నోట్లపై ఆయన బొమ్మను ముద్రించడమే. గాంధీజీ ఫొటో స్థానంలో నేతాజీ చిత్రాన్ని ప్రవేశపెట్టాలి’’ అని ఏబీహెచ్ఎం పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రచూర్ గోస్వామి అన్నారు. దీనిపై కాంగ్రెస్, టీఎంసీ లు విమర్శలు చేశాయి. బెంగాల్ లో విభజన రాజకీయాలను బీజేపీ మానుకోవాలని సూచించాయి.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆధిర్ చౌదరి స్పందిస్తూ.. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో గాంధీజీ పాత్ర కాదనలేనిది. మహాత్మాగాంధీ హత్య వెనుక ఎవరు ఉన్నారన్నది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన ఆశయాలు, సూత్రాలను నిత్యం హననం చేస్తున్నారు. దీనికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమాధానం చెప్పాలి’’ అని చౌదరి డిమాండ్ చేశారు.