Telangana: కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీ నేతలే మాట్లాడతారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- మునుగోడులో కాంగ్రెస్ గెలవదన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై తానేమీ మాట్లాడనన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని ధీమా
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటమే కాకుండా... ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలవరని వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే స్రవంతి స్పందించగా.. తాజాగా నల్లగొండ ఎంపీగా ఉన్న టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీ నేతలే మాట్లాడతారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై తానేమీ చెప్పేది లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎవరేం మాట్లాడినా మునుగోడు ఓటర్లు పట్టించుకోరన్న ఉత్తమ్... ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా విజయం సాధించి తీరుతుందని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తానేమీ మాట్లాడబోనని కూడా ఆయన అన్నారు. ఎనిమిదిన్నరేళ్లుగా ఏమీ చేయని బీజేపీ, టీఆర్ఎస్ లు ఇప్పుడేం చేస్తాయని నిలదీశారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని, స్రవంతి వైపే మునుగోడు ఓటర్లు నిలబడతారని ఉత్తమ్ చెప్పారు.