tamilanadu: ఏపీలో టోల్ ప్లాజా వద్ద తమిళనాడు విద్యార్థుల వీరంగం
- ఫాస్టాగ్ పనిచేయకపోవడంతో ఏర్పడిన వివాదం
- భౌతికంగా చెల్లించాలని కోరిన సిబ్బంది
- నిరాకరించి గొడవకు దిగిన విద్యార్థులు
- వాహనాలకు దారివ్వకపోవడంతో స్థానికుల్లో ఆగ్రహం
తమిళనాడుకు చెందిన ఓ న్యాయ కళాశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లో, జాతీయ రహదారి 71పై సీతమ్మ అగ్రహారం సమీపంలోని ఎస్వీ పురం టోల్ ప్లాజా వద్ద వీరంగం సృష్టించారు. దీనంతటికీ కారణం ఫాస్టాగ్ పనిచేయకపోవడమే. తిరుపతి వెళ్లి వస్తున్న విద్యార్థుల కారును టోల్ ప్లాజా వద్ద సిబ్బంది ఆపారు. టోల్ ఫీజు చెల్లించాలని కోరడంతో వారు దురుసుగా ప్రవర్తించారు. కారులోని న్యాయ విద్యార్థి సిబ్బందిలో ఒకరితో గొడవపడ్డాడు. ఫాస్టాగ్ పనిచేయడం లేదని, కనుక భౌతికంగా ఫీజు చెల్లించాలని కోరారు. అందుకు న్యాయ విద్యార్థి తిరస్కరించాడు. దాంతో అది గొడవకు దారి తీసింది.
దీంతో కారులోని వారు కిందకు దిగి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. వెంటనే ఫీజు చెల్లించి వెనుక ఉన్న వాహనాలకు దారి ఇవ్వాలని కోరారు. దానికి వారు అంగీకరించకపోగా, కేవలం తమిళనాడు రిజిస్ట్రేషన్ తో ఉన్న వాహనాలకు దారి ఇచ్చి, ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలను అడ్డుకున్నారు. తమిళనాడు విద్యార్థులు 100 మందికి పైగా ఉండడంతో వారిని నిలువరించడం కష్టమైంది. దీంతో స్థానికులకు కూడా మండింది. వారు కూడా ఆగ్రహంతో తమిళనాడు విద్యార్థులపై దాడికి దిగారు. దీంతో యుద్ధ వాతావరణం నెలకొంది. వనమలపేట సబ్ఇన్ స్పెక్టర్ రామాంజనేయులు మాట్లాడుతూ.. ఘటన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.