Narendra Modi: 11 వేల అడుగుల ఎత్తు, సున్నా ఉష్ణోగ్రతలో రాత్రంతా ఉన్న ప్రధాని మోదీ
- ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా శనివారం రాత్రి మనా సమీపంలోని బీఆర్ఓ సిబ్బంది డీఈటీ సెంటర్ లో బస చేసిన ప్రధాని
- బీఆర్ఓ కార్మికుడు చేసిన సాధారణ ఖిచ్డీ తిన్న మోదీ
- అతి సాధారణ వసతులు ఉన్న చోటుకు ప్రధాని రావడంతో సిబ్బంది ఆశ్చర్యం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి తన సింప్లిసిటీతో అందరినీ ఆశ్చర్యపరిచారు. శనివారం ఉత్తరాఖండ్ పర్యటన సందర్భంగా మనా సమీపంలోని 11,300 అడుగుల ఎత్తులో రాత్రంతా గడిపారు. అక్కడి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) సిబ్బంది ఉండే డిటాచ్‌మెంట్ (డీఈటీ) వద్ద తాత్కాలిక పైకప్పుతో ఏర్పాటు చేసిన గుడారంలో బస చేశారు. బీఆర్ఓ సిబ్బంది కోసం కార్మికుడు చేసిన సాధారణ ఖిచ్డీ, మాండ్వే కి రోటీ, చట్నీ, ఖీర్ తిన్నారు. ఏకంగా ప్రధాన మంత్రి తాము ఉండే చోటుకు వచ్చి.. అతి సాధారణ వ్యక్తిలా రాత్రంతా తమతో కలిసి ఉండటంతో బీఆర్ఓ సిబ్బంది షాక్ కు గురయ్యారు.
'ప్రధానమంత్రి మనాలోని మా డీఈటీని సందర్శిస్తారని, రాత్రిపూట అక్కడే బస చేస్తారని చెప్పినప్పుడు మేం ఆశ్చర్యపోయాము. డీఈటీకి యువ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ర్యాంక్ అధికారి నాయకత్వం వహిస్తారు. మా దగ్గర అతి సాధారణ మౌలిక సదుపాయాలు ఉంటాయి. దాదాపు ఎలాంటి సౌకర్యాలు లేవు. అలాంటి చోటకు ప్రధాని వచ్చి కొన్ని గంటలు ఉన్నారంటే నమ్మబుద్ది కావడం లేదు’ అని బీఆర్ఓ అధికారి ఒకరు చెప్పారు. డీఈటీ సందర్శనకు వచ్చిన ప్రధాని అక్కడి సిబ్బంది, రోడ్డు నిర్మాణ కార్మికులతో సంభాషిస్తూ రాత్రి అక్కడే గడపాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత వారిలో ఒకరిని భోజనానికి ఖిచ్డీ వండమని అడిగారు.
11,300 అడుగుల ఎత్తులో రాత్రిపూట సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలో చిన్న ఎలక్ట్రిక్ హీటర్ ఏర్పాటు చేసిన గదిలో ప్రధాని బస చేశారు. డీఈటీ సిబ్బందిని కలవడం చాలా సంతోషంగా ఉందని మోదీ చెప్పారు. తన కోసం వంట చేసిన సిబ్బందిని కూడా మెచ్చుకున్నారని అక్కడి అధికారులు తెలిపారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఓ సిబ్బంది చేస్తున్న కృషిని కూడా మోదీ మెచ్చుకున్నారు. డీఈటీ సందర్శకుల పుస్తకంలో కష్టపడితే ప్రతిదీ సాధించవచ్చు అని రాశారు.