Bharath jodo yatra: తెలంగాణలోకి రాహుల్ కు ఘనస్వాగతం... రాష్ట్రంలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

Bharath jodo yatra entered into telangana

  • కృష్ణా వంతెన వద్ద స్వాగతించిన కార్యకర్తలు
  • రాహుల్ తో కలిసి నడిచిన రేవంత్, భట్టి, ఉత్తమ్, మధుయాష్కీ తదితరులు
  • యాత్రకు మూడు రోజుల పాటు విరామం
  • ఢిల్లీకి వెళ్లనున్న కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఆదివారం తెలంగాణలోకి ప్రవేశించింది. మక్తల్ దగ్గర కృష్ణా బ్రిడ్జి పైనుంచి రాహుల్ గాంధీ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ తదితరులు, కార్యకర్తలతో కలిసి రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, డోలు వాయిద్యాలతో రాహుల్ ను స్వాగతించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలంతా రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.

రాష్ట్రంలో మొదటిరోజు సుమారు మూడు కిలోమీటర్ల మేర కొనసాగిన తర్వాత రాహుల్ గాంధీ యాత్రకు విరామం ప్రకటించారు. దీపావళి నేపథ్యంలో భారత్ జోడో యాత్రను మూడు రోజుల పాటు ఆపేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీపావళి, మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పూర్తయ్యాక ఈ నెల 27 న యాత్రను కొనసాగిస్తారని పేర్కొన్నాయి. వచ్చే నెల 7వ తేదీ వరకు తెలంగాణలో కొనసాగనున్న ఈ యాత్ర.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని శాఖాపూర్ వద్ద ముగుస్తుందని వివరించాయి. మొత్తం 12 రోజుల పాటు రాష్ట్రంలోని 375 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News