Ukraine: భారతీయులు ఉక్రెయిన్ విడిచేందుకు ఐదు మార్గాలు సూచించిన భారత ఎంబసీ
- హంగేరీ, స్లోవేకియా,మాల్డోవా, పోలాండ్, రొమేనియా సరిహద్దుల ద్వారా బయట పడాలని సూచన
- నిర్దేశిత పత్రాలు చూపించి సరిహద్దులు దాటాలని ప్రకటన చేసిన ఎంబసీ కార్యాలయం
- ఉక్రెయిన్ పై క్షిపణి, డ్రోన్ దాడులు ముమ్మరం చేసిన రష్యా
ఉక్రెయిన్‌పై క్షిపణి దాడిని ముమ్మరం చేసిన నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని భారత రాయబార కార్యాలయం మూడు రోజుల కిందటే సూచించింది. దీనికి భారత పౌరుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. అయినప్పటికీ ఉక్రెయిన్ సరిహద్దులు దాటి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఐదు ఆప్షన్లు సూచించింది. పాస్‌పోర్ట్, ఉక్రెయిన్ నివాస అనుమతి, విద్యార్థి గుర్తింపు సర్టిఫికేట్, విమాన టిక్కెట్ చూపించి ఈ ఐదు మార్గాల ద్వారా ఉక్రెయిన్ సరిహద్దులు దాటొచ్చని తెలిపింది. ఉక్రెయిన్-హంగేరీ, ఉక్రెయిన్-స్లోవేకియా, ఉక్రెయిన్-మాల్డోవా, ఉక్రెయిన్-పోలాండ్, ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దులను ఎంపిక చేసింది. నిర్దేశిత పత్రాలు చూపించి ఈ మార్గాల ద్వారా ఉక్రెయిన్ నుంచి బయటపడొచ్చని చెప్పింది.
ఉక్రెయిన్-హంగేరీ సరిహద్దు కోసం జకర్పతియా ప్రాంతంలో చెక్‌పోస్టులు ఉన్నాయని, అక్కడికి రైలులో వెళ్లొచ్చని తెలిపింది. ఉక్రెయిన్-స్లోవేకియా మార్గం ఎంచుకున్న వాళ్లు ఆ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద స్కెంజెన్/స్లోవాక్ వీసాను పొందవలసి ఉంటుందని సూచించింది. సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని చెక్‌పోస్టుల పేర్లు, అవి ఉన్న ప్రాంతాలు, సరిహద్దు దాటడానికి సహాయం కోసం పైన పేర్కొన్న దేశాల రాయబార కార్యాలయాలను సంప్రదించాల్సిన నంబర్లతో కూడిన పూర్తి వివరాలను వెల్లడించింది. అంతకుముందు పౌర ప్రాంతాలపై రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ వెళ్లవద్దని భారత రాయబార కార్యాలయం మన దేశ పౌరులకు సూచించింది. ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొత్త దశలోకి ప్రవేశించింది. ఉక్రెయిన్ విద్యుత్ సౌకర్యాలపై రష్యా సైన్యం క్షిపణి, డ్రోన్ దాడులను ప్రారంభించింది. కీవ్ విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలను దెబ్బతీయడంపై రష్యా దృష్టి సారించింది.