Sudan: సూడాన్‌లో గిరిజన తెగల మధ్య ఘర్షణ.. 200 మందికిపైగా మృతి

At least 200 people killed in fighting in Sudan

  • భూమి విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
  • ఇళ్లను విడిచి వెళ్లిపోతున్న గ్రామస్థులు
  • ఈ ఏడాది జనవరి-సెప్టెంబరు మధ్య 546 మంది మృతి
  • ఇళ్లు విడిచిపెట్టిన 2.11 లక్షల మంది

ఆఫ్రికా దేశమైన సూడాన్‌లోని బ్లూనైల్ రాష్ట్రంలో జాతుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక మీడియా తెలిపింది. దక్షిణ సూడాన్, ఇథియోపియో సరిహద్దులో ఉన్న బ్లూనైల్‌లో ఈ ఘర్షణలు రేకెత్తాయి. హౌసా, బెర్ట్ తెగల మధ్య తలెత్తిన భూ వివాదం చినికిచినికి గాలివానగా మారి ఇరు వర్గాల మధ్య పోరుకు దారితీసింది. కాల్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లుతుండడంతో వందలాది మంది ఇళ్లు విడిచి పారిపోతున్నారు. ఇరు వర్గాలు దుకాణాలను తగలబెట్టుకున్నాయి. బుధ, గురువారాల్లో ఈ ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చాయి. దీంతో శుక్రవారం ఇక్కడ అత్యవసర పరిస్థితిని విధిస్తూ ప్రావిన్షియల్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. 

వద్ అల్ మహీ ప్రాంతంలోని మూడు గ్రామాలకు చెందిన 200 మందికిపైగా మరణించారని స్థానిక అసెంబ్లీ చీఫ్ అబ్దెల్ అజీజ్ అల్ అమీన్ పేర్కొన్నారు. ఇంకా కొన్ని మృతదేహాలను పాతిపెట్టలేదని తెలిపారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు మనవతా గ్రూపుల సహాయాన్ని అర్థించారు. ఈ ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య చెబుతున్న దానికంటే ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఘర్షణల కారణంగా ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు మధ్య 546 మంది మరణించారని, 2.11 లక్షల మంది తమ ఇళ్లను విడిచి వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

  • Loading...

More Telugu News