Virat Kohli: నిన్నటి మ్యాచ్ తో పలు రికార్డులను సొంతం చేసుకున్న కోహ్లీ.. సచిన్ రికార్డు బద్దలు!
- నిన్న పాకిస్థాన్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ
- ఒంటి చేత్తో భారత్ ను విజయ తీరాలకు చేర్చిన విరాట్
- ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్ సాధించిన వైనం
టీ20 ప్రపంచకప్ లో భాగంగా నిన్న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మరో హై ఓల్టేజ్ మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ మ్యాచ్ లో భారత్ విజేతగా నిలిచింది. కింగ్ కోహ్లీ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఇండియాను ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చారు. కళ్లు చెదిరే షాట్లు కొట్టిన కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో పలు రికార్డులను కోహ్లీ సొంతం చేసుకున్నాడు.
టీ20 ప్రపంచకప్ లో 6వ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కోహ్లీ అందుకున్నాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ (5 సార్లు) రికార్డును కోహ్లీ అధిగమించాడు.
అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించిన ఆటగాడిగా (14 సార్లు) అవతరించారు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన మొహమ్మద్ నబీని రెండో స్థానానికి నెట్టేశాడు.
టీ20 రన్ ఛేజింగ్ లో అత్యధిక సార్లు నాటౌట్ గా నిలిచిన ఆటగాడిగా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (18 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.
పాకిస్థాన్ పై టీ20ల్లో అత్యధిక పరుగులు (3,794) చేసిన క్రికెటర్ గా రికార్దు సాధించాడు. 3,741 పరుగులు చేసిన రోహిత్ శర్మ రెండో స్థానానికి పడిపోయాడు.
ఐసీసీ టోర్నీల్లో అత్యధిక 50 ప్లస్ పరుగులు చేసిన క్రికెటర్ గా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 23 సార్లు 50 ప్లస్ పరుగులు సాధించగా... కోహ్లీ నిన్న 24వ సారి ఆ ఫీట్ ను సాధించాడు.