Congress: ప్రజల దృష్టిని మళ్లించేందుకే... ట్రస్టుల ఎఫ్ సీఆర్ఏ లైసెన్సు రద్దుపై కాంగ్రెస్
- పాత ఆరోపణలనే తవ్వి తీసి లైసెన్స్ రద్దు చేసింది
- కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు
- రాజీవ్ గాంధీ ట్రస్టులపై బురదజల్లే ప్రయత్నమని ఆరోపణలు
- ట్రస్టుల నిర్వహణ పూర్తిగా పారదర్శకంగా ఉందన్న జైరాం రమేశ్
పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం తదితర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాజీవ్ గాంధీ ట్రస్టుల ఎఫ్ సీఆర్ఏ లైసెన్సులను రద్దు చేసిందని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నిత్యజీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ట్రస్టుల నిర్వహణ మొత్తం పూర్తి పారదర్శకతతో జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ల ఆర్థిక వ్యవహారాలన్నీ క్లియర్ గా ఉన్నాయని తెలిపారు. ఎప్పటివో పాత ఆరోపణలను ఇప్పుడు వెలికితీసి కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందన్నారు. ప్రజాసేవ కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఏర్పాటు చేసిన ఎన్జీవోలకు విదేశాల నుంచి వచ్చే విరాళాలను అడ్డుకోవడం దుర్మార్గమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైన న్యాయపోరాటం చేస్తామని జైరాం రమేశ్ స్పష్టం చేశారు.
గాంధీ కుటుంబ నిర్వహణలో ఉన్న రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ల ఎఫ్ సీఆర్ఏ లైసెన్సులను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి అందుకుంటున్న విరాళాలకు సంబంధించి ఖర్చుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదనే ఆరోపణలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో విదేశాల నుంచి విరాళాలు స్వీకరించేందుకు ఆ రెండు ఎన్జీవోలకు అవకాశం లేకుండా పోయింది. ఈ రెండు సంస్థల నిర్వహణ బాధ్యతలను సోనియా కుటుంబం నేతృత్వంలోని కమిటీ చూసుకుంటుంది. మహిళలు, యువత స్వయం సమృద్ధికి తోడ్పడడం, పకృతి వైపరీత్యాలు జరిగినపుడు బాధితులను ఆదుకోవడం తదితర కార్యకలాపాల్లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ సేవలు అందిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు పనిచేస్తుంటుంది.