Atchannaidu: టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం జగన్ నియంత పాలనకు నిదర్శనం: అచ్చెన్నాయుడు
- బీఆర్ నాయుడు చేసిన తప్పేంటన్న అచ్చెన్న
- అమరావతి రైతులకు మద్దతివ్వడం నేరమా అంటూ ఆగ్రహం
- ఏపీలో మీడియా కష్టకాలంలో ఉందని వెల్లడి
- జగన్ నియంత లక్షణాలు వీడాలని హితవు
ఏపీలో మీడియా రంగం కష్టకాలం ఎదుర్కొంటోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం జగన్ నియంత పాలనకు నిదర్శనం అని విమర్శించారు.
బీఆర్ నాయుడు చేసిన తప్పేంటి? అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన ఏమైనా పాకిస్థాన్ బోర్డర్ కు వెళ్లి టెర్రరిస్టులను కలిశారా? అంటూ నిలదీశారు. అమరావతి రైతులకు మద్దతు పలకడం నేరమా? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రశ్నించే గొంతుకలను నులిమి వేయాలని జగన్ ప్రయత్నం అంటూ మండిపడ్డారు. జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం మీడియా రంగం అని, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న మీడియాపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జగన్ ఇకనైనా నియంత లక్షణాలు వీడాలని, ప్రజాస్వామ్య పాలన అలవర్చుకోవాలని హితవు పలికారు.