Solar Eclipse: రేపు సూర్యగ్రహణం... తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
- ఈ నెల 25న పాక్షిక సూర్యగ్రహణం
- ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఆలయం మూసివేత
- అనంతరం సర్వదర్శనం భక్తులకే అనుమతి
రేపు (అక్టోబరు 25) దేశంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో, తిరుమలలో శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయం మూసివేస్తారు.
ఈ సమయంలో అన్ని రకాల దర్శనాలు రద్దు చేశారు. లడ్డూ విక్రయం, అన్నప్రసాద వితరణ రద్దు చేయనున్నారు. రేపు దర్శనాలు లేనందున నేడు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించరు. గ్రహణ ఘడియలు ముగిసిన తర్వాత ఆలయం తలుపులు తిరిగి తెరవనున్నారు. ఆలయ శుద్ధి అనంతరం కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే అనుమతిస్తారు.
కాగా, ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏళ్ల తర్వాత ఏర్పడనుంది. 2025 లోనూ పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నా, అది భారత్ లో కనిపించదు. మళ్లీ భారత్ లో పాక్షిక సూర్యగ్రహణం వీక్షించాలంటే 2032 వరకు ఆగాల్సి ఉంటుంది. అందుకే రేపటి పాక్షిక సూర్యగ్రహణంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. కాగా, హైదరాబాదులో ఈ పాక్షిక సూర్యగ్రహణం సాయంత్రం 4.59 గంటలకు కనిపించనుంది.