COVID19: ఆసుపత్రుల్లో చేరని కరోనా రోగులకు సంబంధించి ఒళ్లు జలదరించే విషయాలు బయటపెట్టిన అధ్యయనం
- కరోనా సోకినా ఆసుపత్రుల్లో చేరని వారి నరాల్లో వెనస్ త్రాంబోఎంబోలిజమ్స్
- 54 వేల మందిపై 41/2 నెలల పాటు అధ్యయనం
- కరోనా సోకని వారితో పోలిస్తే వ్యాధికి గురైన వారిలో మరణ ముప్పు 118 రెట్లు ఎక్కువ
రెండేళ్ల క్రితం ఈ ప్రపంచంపై దాడిచేసిన కరోనా వైరస్ ఎంతటి మారణహోమం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మహమ్మారి బారినపడి ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది చావు అంచుల్లోకి వెళ్లి తిరిగొచ్చారు. తాజాగా, కరోనాకు సంబంధించి మరో భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా తొలుత సిరల్లో ప్రారంభమై గుండె, ఊపిరితిత్తులు, శరీరంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించడమే కాకుండా రక్తాన్ని గడ్డ కట్టిస్తున్న వైనం వెలుగు చూసింది.
వెనస్ త్రాంబోలెంబోలిజమ్స్
తాజాగా యూకేలో జరిగిన అధ్యయనంలో హృదయ సంబంధిత వ్యాధుల రేటును పెంచడంలో కరోనా కీలక పాత్ర పోషిస్తున్నట్టు తేలింది. లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ప్రకారం.. కరోనా సోకని వారితో పోలిస్తే సోకినా ఆసుపత్రుల్లో చేరని వారి నరాల్లో వెనస్ త్రాంబోఎంబోలిజమ్స్గా పిలిచే క్లాట్స్ (రక్తం గడ్డకట్టడం) ఏర్పడే ప్రమాదం 2.7 రెట్లు ఎక్కువ. అలాగే, కరోనా సోకని వారితో పోలిస్తే మరణించే ప్రమాదం 10 రెట్లు ఎక్కువగా ఉంది. 41/2 నెలలపాటు దాదాపు 54 వేల మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. పరిస్థితిని బట్టి తొలి 30 రోజుల్లోనే ఈ ముప్పు ఎక్కువని శాస్త్రవేత్తలు గురించారు. చాలా దేశాలు కరోనాను సాధారణీకరించినప్పటికీ ఆసుపత్రిలో చేరని కొవిడ్ రోగులలో పెరిగిన మరణ ముప్పు మరొక రిమైండర్‌గా ఉందని సెయింట్ లూయిస్ హెల్త్ కేర్ సిస్టమ్‌లోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జియాద్ అల్-అలీ అన్నారు. అయితే, కొవిడ్ గురించి సాధారణమైనదేమీ లేదని పేర్కొన్నారు.
కరోనా వైరస్ కారణంగా కనుగొనని ప్రమాదాలకు ఇది మరొక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ కరోనాతో ఆసుపత్రిలో చేరిన రోగులకు కూడా ప్రమాదాలు చాలా ఎక్కువగానే ఉన్నాయని అన్నారు. వీరికి వెనస్ త్రాంబోఎంబోలిజం ప్రమాదం 28 రెట్లు ఎక్కువగా ఉందని, గుండె ఆగిపోయే ప్రమాదం 22 రెట్లు ఎక్కువని వివరించారు. అలాగే, స్ట్రోక్ వచ్చే ప్రమాదం 18 రెట్లు ఎక్కువని పేర్కొన్నారు. వ్యాధి సోకని వారితో పోలిస్తే వీరు చనిపోయే ప్రమాదం 118 రెట్లు ఎక్కువగా ఉందన్నారు.
మొదటి రెండు వేవ్‌ల డేటా ఆధారంగా..
ఇందుకు సంబంధించిన నివేదిక ‘హార్ట్’ జర్నల్‌లో నిన్న ప్రచురితమైంది. కరోనా మొదటి రెండు వేవ్‌ల సమయంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. కరోనా ఇన్ఫెక్షన్ ప్రారంభ సమయంలో రక్తాన్ని మోసుకెళ్లే ధమనులకు హాని కలిగించే అవకాశంతోపాటు ప్రాణానికి ముప్పు కలిగించేలా గడ్డకట్టడానికి కారణమవుతుందన్న విషయం ఈ అధ్యయనంలో తేలింది.