Whatsapp: హమ్మయ్యా... మళ్లీ ప్రారంభమైన వాట్సాప్ సేవలు
- దాదాపు రెండు గంటల సేపు నిలిచిపోయిన వాట్సాప్ సేవలు
- గందరగోళానికి గురైన కోట్లాది మంది యూజర్లు
- సమస్య ఏమిటో ఇంకా వెల్లడించని వాట్సాప్
ప్రపంచ ప్రఖ్యాత మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఇండియాతో పాటు ప్రపంచంలోని పలు చోట్ల వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు గంటల పాటు సర్వీసులు ఆగిపోయాయి. మెసేజీల సెండింగ్, రిసీవింగ్ నిలిచిపోయాయి. కనీసం డెలివరీ స్టేటస్ కూడా కనిపించలేదు. దీంతో, కోట్లాది మంది యూజర్లు గందరగోళానికి గురయ్యారు. ప్రతి దానికి వాట్సాప్ మీదే ఆధారపడి ఉండటంతో... ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి చాలా మంది వెళ్లిపోయారు.
అయితే, ఈ సమస్యపై వర్క్ చేసిన వాట్సాప్ టెక్నికల్ టీమ్ సమస్యను పరిష్కరించింది. సర్వీసులను పునరుద్ధరించింది. మరోవైపు, సమస్య ఏమిటనేది వాట్సాప్ ఇంకా వెల్లడించలేదు. కాసేపట్లో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇంకోవైపు, వాట్సాప్ మళ్లీ యథావిధిగా పని చేస్తుండటంతో యూజర్లు 'హమ్మయ్యా' అనుకుంటున్నారు.