Wasim Akram: టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే... సందేహం అక్కర్లేదు: వసీం అక్రమ్
- హార్దిక్ పాండ్యాపై అక్రమ్ ప్రశంసల వర్షం
- పాక్ తో మ్యాచ్ లో పాండ్యా ఆల్ రౌండ్ షో
- భవిష్యత్తులో టీమిండియా పగ్గాలు అందుకుంటాడన్న అక్రమ్
- కెప్టెన్ కు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయని కితాబు
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా శుభారంభం చేయడం తెలిసిందే. పాకిస్థాన్ తో జరిగిన సూపర్-12 మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా కీలకపాత్ర పోషించారు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో 40 పరుగులు చేయడమే కాదు, అంతకుముందు బౌలింగ్ సందర్భంగా 3 వికెట్లు తీసి సత్తా చాటాడు.
ఈ నేపథ్యంలో, పాండ్యాపై పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా తదుపరి కెప్టెన్ పాండ్యానే అని పేర్కొన్నాడు. భవిష్యత్తులో భారత జట్టు పగ్గాలు అందుకునే అన్ని లక్షణాలు అతడిలో ఉన్నాయని కొనియాడాడు.
ఐపీఎల్ ద్వారా తొలిసారి కెప్టెన్సీ చేపట్టిన పాండ్యా అద్భుతంగా రాణించి తన జట్టుకు టైటిల్ అందించాడని అక్రమ్ వెల్లడించాడు. ఇప్పుడు పాండ్యా టీమిండియాలో కీలక ఆటగాడిగానే కాకుండా, కెప్టెన్ కు సలహాలు ఇవ్వగల సత్తా ఉన్నవాడని, జట్టు గెలుపోటములపై అతడి ప్రభావం కూడా ఉంటుందని వివరించాడు.