Rishi Sunak: ఆ ఫొటోలో ఆశిష్ నెహ్రాతో ఉన్నది రిషి సునాక్ కాదట.. ఆ బాలుడెవరో చెప్పిన అజ్జూ భాయ్
- ఆశిష్ నెహ్రా నుంచి ప్రశంసా పత్రం అందుకుంటున్న బాలుడు
- ఆ బాలుడు రిషి సునాకేనంటూ నిన్నటి నుంచి ప్రచారం
- ఆ ఫొటోలో ఉన్నది విరాట్ కోహ్లీ అంటూ వివరణ ఇచ్చిన అజారుద్దీన్
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి పీఠం దక్కించుకున్న వేళ... ఆయనకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా ఓ ఫొటో నిన్నటి నుంచి తెగ వైరల్ గా మారింది. ఆ ఫొటోలో టీమిండియా మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా చేత ఓ పత్రాన్ని అందుకుంటున్న బాలుడు కనిపిస్తున్నాడు. ఆ బాలుడు మరెవరో కాదు రిషి సునాకేనంటూ పలువురు ఆ ఫొటోను షేర్ చేస్తున్నారు.
ఈ ఫోటోపై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ క్లారిటీ ఇచ్చారు. ఆశిష్ నెహ్రాతో ఆ ఫొటోలో ఉన్నది రిషి సునాక్ కాదని చెప్పిన అజారుద్దీన్... ఆ బాలుడు ప్రస్తుతం టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ అని తెలిపారు. అజారుద్దీన్ క్లారిటీ తర్వాత చాలా మంది నిజమే సుమా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. 1979లో జన్మించిన ఆశిష్ నెహ్రాకు ప్రస్తుతం 43 ఏళ్లు. అదే 1980లో జన్మించిన సునాక్ కు ప్రస్తుతం 42 ఏళ్లు. మరి ఈ ఫొటోలో అంతెత్తున కనిపిస్తున్న ఆశిష్ నెహ్రా ముందు కేవలం ఏడాది కాలం చిన్నోడైన సునాక్ అంత చిన్నగా కనిపిస్తారా? అంటూ తమ తప్పును గుర్తిస్తున్నారు.