CCI: వారం వ్యవధిలో గూగుల్ కు మరోసారి జరిమానా వడ్డించిన సీసీఐ
- ఇటీవల గూగుల్ పై రూ.1,338 కోట్ల జరిమానా
- మరోసారి కొరడా ఝుళిపించిన సీసీఐ
- గూగుల్ పోటీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపణ
- తాజాగా రూ.936 కోట్ల పెనాల్టీ
ప్రముఖ సెర్చింజిన్, టెక్ దిగ్గజం గూగుల్ కు భారత్ లో మరోసారి జరిమానా విధించారు. ఇటీవలే గూగుల్ పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.1,338 కోట్ల భారీ జరిమానా వడ్డించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్ ఎకో సిస్టమ్ తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందన్న కారణంతో సీసీఐ ఈ జరిమానా విధించింది.
ఈ జరిమానా విధించి వారం గడవక ముందే గూగుల్ పై సీసీఐ మరోసారి కొరడా ఝుళిపించింది. ఈసారి రూ.936.44 కోట్ల జరిమానా విధించింది. గూగుల్ ప్లే స్టోర్ పాలసీలకు సంబంధించి పోటీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందంటూ ఆరోపించింది. నిర్దేశిత గడువులోపల గూగుల్ తన వైఖరి మార్చుకోవాలనీ సీసీఐ ఆదేశించింది.