Yanamala: వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసమే మూడు రాజధానుల పేరుతో రెచ్చగొడుతున్నారు: యనమల

yanamala ramakrishnudu press note

  • హైకోర్టు ఆదేశాల అమలులో ప్రభుత్వం విఫలం
  • జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నాడని వ్యాఖ్య
  • అమరావతి రైతుల యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన
  • అది తట్టుకోలేక వారిపై దాడులు చేయిస్తున్నారు: యనమల ఆరోపణలు

మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొందాలన్నదే వైసీపీ ఆలోచనని శాసనమండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలు కార్యనిర్వాహక రాజధానిని కోరుకోవడంలేదని చెప్పారు. వారికి కావాల్సిన అభివృద్ధిని జగన్ రెడ్డి ఎటూ చేయలేడన్నారు. దీంతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 

అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న స్పందన చూసి ఈ యాత్రను అడ్డుకోవడానికి  వైసీపీ ప్రభుత్వం చేయని పన్నాగం అంటూ లేదన్నారు. రైతులపై రౌడీలతో దాడులు చేయించారు, దుర్బాషలాడించారు, రాళ్లు, పెట్రోల్ బాటిళ్లతో దాడి చేయించారని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి అంటే జగన్ రెడ్డికి అంత కక్ష ఎందుకని యనమల ప్రశ్నించారు.

మూడు రాజధానుల గురించి మాట్లాడే హక్కు వైసీపీ ఎమ్మెల్యేలకు లేదని యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పారు. హైకోర్ట్ ఆర్డర్ ఉనికిలో ఉన్నప్పుడు మూడు రాజధానుల గురించి ఎలా మాట్లాడతారని వైసీపీ నేతలను యనమల నిలదీశారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో, సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులను సకాలంలో పొందడంలోనూ జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. మూడు బిల్లులను కూడా శాసనసభ నుంచి ఉపసంహరించుకున్నారు. చట్టాలు వారి వాదనకు మద్దతు ఇవ్వడంలేదని స్పష్టంగా అర్థమవుతోందని వివరించారు. వైసీపీ చేసిన ఈ చర్య నిస్సందేహంగా కోర్టు ధిక్కారమేనని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. 

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయంగా గెలుపొందడం కోసమే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగుతున్నారని యనమల ఆరోపించారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని ప్రచారం ముసుగులో ఆ మూడు జిల్లాలకు చెందిన విలువైన ఆస్తులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇది మూడు జిల్లాల ప్రజలకు తెలిసిన వైసీపీ అంతర్గత వ్యూహం అని, జగన్ ఈ క్రూరమైన ప్రచారాన్ని ఇకనైనా ఆపాలని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News