Rajnath Singh: ఎవరూ 'అణు' గీత దాటొద్దు... రష్యాకు హితవు పలికిన రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh talks to Russian counterpart on Ukraine conflict

  • ఉక్రెయిన్ డర్టీ బాంబ్ సిద్ధం చేస్తోందంటూ రష్యా ఆరోపణ
  • రాజ్ నాథ్, సెర్గీ షొయిగు మధ్య ఫోన్ సంభాషణ
  • సమస్య పరిష్కారానికి చర్చలే మార్గమన్న రాజ్ నాథ్
  • అణ్వస్త్ర ప్రయోగం తగదని స్పష్టీకరణ

భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగుతో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ఉక్రెయిన్ తమపై దాడి కోసం 'డర్టీ బాంబ్' సిద్ధం చేస్తోందని షొయిగు చెప్పగా, అందుకు రాజ్ నాథ్ స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య సంక్షోభాన్ని చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని షొయిగుకు సూచించారు. భారత్ కోరుకుంటున్నది ఇదేనని ఉద్ఘాటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా, ఉక్రెయిన్ అణ్వస్త్ర ప్రయోగానికి దిగరాదని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికి అణుయుద్ధం ఎంతమాత్రం వాంఛనీయం కాదని పేర్కొన్నారు. 

కాగా, డర్టీ బాంబ్ పేరుతో ఉక్రెయిన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని రష్యా గత కొన్నిరోజులుగా ఆరోపిస్తోంది. దీనిపై రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు తన మిత్రదేశాలకు సమాచారం అందిస్తున్నారు. భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఇదే విషయాన్ని చెప్పిన ఆయన, చైనా ప్రభుత్వానికి కూడా డర్టీ బాంబ్ వివరాలను తెలియజేశారు. 

అయితే, ఉక్రెయిన్ డర్టీ బాంబ్ వేసే ప్రమాదం ఉందంటూ ప్రచారం చేసి, చివరికి ఆత్మరక్షణ పేరిట రష్యా ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సెర్గీ షొయిగు ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుండడం కూడా సందేహాలకు తావిస్తోంది.

  • Loading...

More Telugu News