ICC: ఆహారం బాగాలేదన్న టీమిండియా ఆరోపణలపై స్పందించిన ఐసీసీ
- టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా
- ప్రాక్టీసు అనంతర ఆహారంపై అసంతృప్తి
- హోటల్ లో ఆహారం తెప్పించుకున్న ఆటగాళ్లు
- పరిశీలిస్తున్నామన్న ఐసీసీ
టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియాకు ఆహార సమస్య ఎదురైంది. ప్రాక్టీసు అనంతరం తమకు అందిస్తున్న ఆహారాన్ని టీమిండియా ఆటగాళ్లు తిరస్కరించడం తెలిసిందే. చల్లారిన శాండ్విచ్ లను, పండ్లను, ఫలాఫెల్ (పెద్ద శనగలు, ఇతర పప్పులతో తయారుచేసే ఉండలు.. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం) ను తాము స్వీకరించబోమని భారత క్రికెటర్లు స్పష్టం చేశారు. హోటల్ లో తమకు నచ్చిన ఆహారాన్ని తెప్పించుకుని తిన్నారు.
టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు వచ్చిన అన్ని జట్లకు ప్రాక్టీసు అనంతరం ఒకే తరహా ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ ప్రాక్టీస్ మెనూను ఐసీసీ అందిస్తోంది. టీమిండియా ఆటగాళ్లు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఐసీసీ స్పందించింది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించింది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత జట్టు ప్రాక్టీసు అనంతరం ఆహారం పట్ల తమకు సమాచారం అందించిందని, దీనిపై తాము దృష్టి సారించామని ఐసీసీ వర్గాలు తెలిపాయి.
కాగా, నేడు భారత జట్టు ప్రాక్టీసుకు వెళ్లకుండా హోటల్ కే పరిమితమైంది. ప్రాక్టీసు కోసం ఏర్పాటు చేసిన మైదానం సిడ్నీ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో, అంతదూరం ప్రయాణించేందుకు టీమిండియా క్రికెటర్లు ఆసక్తి చూపలేదు.