Goteti Ramachandra Rao: ఎన్టీ రామారావు వద్ద ఓఎస్డీగా పనిచేసిన గోటేటి రామచంద్రరావు కన్నుమూత... నివాళులు అర్పించిన చంద్రబాబు
- ఎన్టీఆర్ సీఎంగా పనిచేసిన కాలంలో ఓఎస్డీగా గోటేటి
- ఎన్టీఆర్ కు చేదోడుగా నిలిచిన అధికారి
- రామచంద్రరావు మరణం పట్ల చంద్రబాబు విచారం
- ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన టీడీపీ అధినేత
దివంగత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసిన గోటేటి రామచంద్రరావు నేడు కన్నుమూశారు. హైదరాబాద్ లో గోటేటి రామచంద్రరావు భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. రామచంద్రరావు కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.
దీనిపై చంద్రబాబు ట్విట్టర్ లోనూ స్పందించారు. గోటేటి రామచంద్రరావు మరణవార్త విచారం కలిగించిందని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
కాగా, ఎన్టీఆర్ నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచి గోటేటి రామచంద్రరావు ప్రత్యేక అధికారిగా ఆయన వెన్నంటే ఉన్నారు. అనేక అంశాల్లో ఎన్టీఆర్ కు చేదోడుగా నిలిచారు. గతంలో, లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను విశాఖ మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించగా, గోటేటి రామచంద్రరావును కూడా ఘనంగా సత్కరించారు.
కాగా, నందమూరి హరికృష్ణ మరణానంతరం గోటేటి రామచంద్రరావు ఓ వ్యాసం రాశారు. అందులో ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. "ఓసారి ఎన్టీ రామారావు కొత్త కారు కొనాలని భావించారు. బెంజ్ షోరూం ప్రతినిధి ఓ కారును తీసుకువచ్చి దాని ధరను ఎన్టీఆర్ కు చెప్పగా, అమ్మో... రూ.6.50 లక్షలా అంటూ వెనుకంజవేశారు. అందుకు షోరూం ప్రతినిధి స్పందిస్తూ, ఇలాంటిదే ఓ కారును మీ అబ్బాయి హరికృష్ణ మొన్ననే కొన్నాడు అని చెప్పారు. దాంతో ఎన్టీఆర్ బదులిస్తూ... ఎందుకు కొనడండీ... ఆయన ఎన్టీఆర్ కొడుకు మరి. నేను మామూలు నందమూరి లక్ష్మయ్య చౌదరి కొడుకును. హరికృష్ణకు నాకు తేడా ఉంది కదండీ అంటూ ఎన్టీఆర్ చమత్కరించారు. ఆ సమయంలో ఆ కారును ఎన్టీఆర్ కొనలేదు" అని గోటేటి రామచంద్రరావు నాటి తన వ్యాసంలో తెలిపారు