Little Girl: ప్రతిభతో పేటీఎం చీఫ్ కంట్లో పడ్డ ఏడేళ్ల బాలిక

Little Girl Strong Financial Understanding Catches Paytm CEOs Attention

  • మ్యూచువల్ ఫండ్స్ ప్రయోజనాలపై ఉపన్యాసం
  • ఏడేళ్లకే పొదుపు డబ్బులు ఫండ్స్ లో పెడుతున్న చిన్నారి
  • తన ట్విట్టర్ హ్యాండిల్ పై రీపోస్ట్ చేసిన విజయ్ శేఖర్ శర్మ

ప్రతిభకు వయసు అడ్డు కాదని నిరూపించింది ఏడేళ్ల బాలిక. అంతేకాదు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడితే కలిగే ప్రయోజనాలపై అనర్గళ ప్రసంగంతో ప్రముఖ చెల్లింపుల సేవల కంపెనీ పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ దృష్టిని ఆకర్షించింది.

మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి రాబడులు, సంపద సృష్టికి మార్గమన్న విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రెట్టింపునకు పైగా పెరగడం ఈ అవగాహననే తెలియజేస్తోంది. ఈ ఏడేళ్ల చిన్నారి తన పొదుపు డబ్బులను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తోంది. 

దీని గురించి ఆమె చెప్పిన వీడియోను ఆమె తల్లి స్వాతి దుగార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ దృష్టిలో పడింది. దాంతో ఆయన మ్యూచువల్ ఫండ్స్ సహీ హై అనే క్యాప్షన్ తో తన ట్విట్టర్ హ్యాండిల్ పై రీపోస్ట్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? అందులో ఒకరు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అన్నది వీడియోలో చిన్నారి వివరించడం ఎవరినైనా ఆకర్షిస్తుంది.

‘‘ఏ కంపెనీ మంచిది, ఏ కంపెనీ మంచిది కాదు? అన్నది మ్యూచువల్ ఫండ్స్ కు తెలుస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ మంచి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినప్పుడు, ఆ కంపెనీ లాభాలు ఆర్జిస్తే నా పెట్టుబడి కూడా పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ అన్ని సందర్భాల్లోనూ లాభాలనే ఇవ్వవు. కొన్ని సందర్భాల్లో నష్టాలను కూడా ఇస్తాయి. వాటిని తట్టుకోగలగాలి’’అని కూడా సూచించింది. ఈ చిన్నారి ప్రతిభను ట్విట్టర్ యూజర్లు మనసారా మెచ్చుకుంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ సహీ హై ప్రచారానికి ఆమెను వినియోగించుకోవాలని ఓ యూజర్ సూచించాడు.

  • Loading...

More Telugu News