Telangana: ఫామ్ హౌజ్ ఘటనపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ
- ఫామ్ హౌజ్ ఘటనపై సిట్ తో విచారణ చేపట్టాలన్న బీజేపీ
- సిట్ ను ఏర్పాటు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైనం
- తెలంగాణ పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన బీజేపీ
టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగినట్లుగా భావిస్తున్న భారీ ఆపరేషన్ ఆకర్ష్ పై బీజేపీ తెలంగాణ శాఖ హైకోర్టును ఆశ్రయించింది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ వేదికగా జరిగిన ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) (సిట్)తో దర్యాప్తు చేయించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర శాఖ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా బీజేపీ తన పిటిషన్ లో హైకోర్టును అభ్యర్థించింది.
ఈ సందర్భంగా తెలంగాణ పోలీసు శాఖపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో చోటుచేసుకున్న పరిణామాలు పరిశీలిస్తే... తెలంగాణ పోలీసు శాఖ విచారణ చేపడితే అసలు వాస్తవాలు బయటకు రావని కూడా బీజేపీ ఆరోపించింది. ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేలాలంటే సిట్ విచారణ ఒక్కటే మార్గమని అభిప్రాయపడింది. బీజేపీ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. దానిపై విచారణ తేదీని ప్రకటించాల్సి ఉంది.