Telangana: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తాం: రాహుల్ గాంధీ
- తెలంగాణలో సాగుతున్న భారత్ జోడో యాత్ర
- రాహుల్ తో కలిసి నడుస్తున్న రేవంత్ రెడ్డి
- తెలంగాణలో సాగుతున్న పాలనపై రాహుల్ కు వివరణ
- కౌలు రైతులకు భరోసా కల్పిస్తామన్న రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్ర పేరిట తెలంగాణలో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని ఆయన అన్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని కౌలు రైతులను ఆదుకుంటామని కూడా ఆయన అన్నారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... రాష్ట్రంలో సాగుతున్న పాలన గురించి వివరించారు. ధరణి పోర్టల్ వల్ల వాస్తవ భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అదే సమయంలో కబ్జాకోరులకు ఆయాచిత లబ్ధి జరుగుతోందని రేవంత్ చెప్పారు.
ఈ వివరాలన్నీ విన్న రాహుల్ గాంధీ... గురువారం మధ్యాహ్నం తెలంగాణకు చెందిన పలువురు రైతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. భూ యజమానులకే భద్రత లేకపోతే ఇంకెవరికి భద్రత ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో సాగు కలిసి రాక పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారిలో మెజారిటీ రైతులు కౌలు రైతులేనని రాహుల్ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక కౌలు రైతులకు భరోసా కల్పిస్తామని ఆయన అన్నారు.