Telangana: మునుగోడులో నల్లా తిప్పితే నీళ్లకు బదులు లిక్కర్ వస్తోంది: వైఎస్ షర్మిల
- ప్రజాస్వామ్యాన్ని ఆ 3 పార్టీలు ఖూనీ చేస్తున్నాయన్న షర్మిల
- టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లను బహిష్కరించాలని పిలుపు
- ఎమ్మెల్యేలను కొనాలని చూసిందెవరు? అమ్ముడుబోయేందుకు చూసిందెవరని ప్రశ్న
- ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ లో ఎందుకు దాచారని నిలదీత
తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నం, మునుగోడు ఉప ఎన్నికలపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల గురువారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికను డబ్బుతో గెలవాలనుకుంటున్న ప్రధాన పార్టీలు...ఓటర్లను భారీ ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే మునుగోడులో నల్లా తిప్పితే నీళ్లకు బదులుగా లిక్కర్ వస్తోందని ఆమె ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయకుండా బహిష్కరించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నంపై కూడా షర్మిల స్పందించారు. ఎమ్మెల్యేలను కొనాలని చూసిందెవరు?.. అమ్ముడుబోవడానికి చూసిందెవరు? అంటూ ఆమె ప్రశ్నించారు. కేవలం డబ్బులు దొరికాయంటూ కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు... అక్కడే ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రం ప్రగతి భవన్ కు ఎందుకు తరలించారని ప్రశ్నించారు. ఘటనా స్థలంలోనే ఉన్న ఎమ్మెల్యేలను కూడా విచారించాలి కదా అని ఆమె అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు అమాయకులే అయితే... వారిని ప్రగతి భవన్ లో ఎందుకు దాచారని కూడా షర్మిల ప్రశ్నించారు.