YSRCP: జగన్ బెయిలు రద్దు చేయాలన్న రఘురామరాజు పిటిషన్ కొట్టివేత

Telangana Highi Court Dismissed Raghu Rama Raju Pettition

  • సీఎంగా జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న రఘురామకృష్ణరాజు
  • బెయిలు రద్దు చేయాలంటూ పిటిషన్
  • బెయిలు రద్దుకు సరైన కారణాలు లేవన్న తెలంగాణ హైకోర్టు
  • జగన్ బెయిలు షరతులను ఉల్లంఘించారని చెప్పేందుకు ఒక్క ఘటన కూడా లేదన్న న్యాయస్థానం  

అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ప్రధాన నిందితుడైన జగన్ మోహన్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. బెయిలు రద్దుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. జగన్ మోహన్‌రెడ్డి బెయిలు షరతులను ఉల్లంఘించారని చెప్పేందుకు ఒక్క ఘటనను కూడా పేర్కొనలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాబట్టి బెయిలును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తన తీర్పులో స్పష్టం చేశారు.

జగన్ ద్వారా బెదిరింపులు, ప్రలోభాలకు గురైన సాక్షుల వివరాలను వెల్లడించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి సహ నిందితులకు కీలక పదవులు ఇవ్వడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేస్తారన్నవి సరైన కారణాలు కావని హైకోర్టు పేర్కొంది. 

బెయిలు రద్దు కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు గతేడాది సెప్టెంబరు 15న కొట్టివేసిందని గుర్తు చేసిన న్యాయస్థానం.. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవని సీబీఐ పేర్కొందని న్యాయమూర్తి పేర్కొన్నారు. కాబట్టి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత బెయిలు రద్దు కోరుతూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తన తీర్పులో పేర్కొన్నారు. 

కాగా, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన బెయిలును రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనను సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.

  • Loading...

More Telugu News