Rajasthan: రాజస్థాన్‌లో ప్రపంచంలోనే ఎత్తయిన శివుడి విగ్రహం.. నేడు ఆవిష్కరించనున్న సీఎం
- రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారాలో ఏర్పాటు
- ధ్యానముద్రలో ఉన్న శివుడి విగ్రహం ఎత్తు 369 అడుగులు
- 20 కిలోమీటర్ల నుంచి కూడా కనిపించనున్న విగ్రహం
- నిర్మాణానికి పదేళ్లు.. 250 సంవత్సరాలపాటు ఉండేలా నిర్మాణం
రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారాలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శివుడి విగ్రహాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారి బాపు సమక్షంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ నేడు ఆవిష్కరించనున్నారు. ‘విశ్వాస్ స్వరూపం’ పేరుతో శివుడు ధ్యానముద్రలో ఉన్నట్టు ఈ విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా నవంబరు 6 వరకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
విగ్రహ విశేషాలివే..
* శివుడి విగ్రహం ఎత్తు 369 అడుగులు
* 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ విగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది
* తత్ పదం సంస్థాన్ ట్రస్టీ, మిరాజ్ గ్రూప్ చైర్మన్ మదన్ పాలీవాల్ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు.
* విగ్రహ నిర్మాణంలో 3 వేల టన్నుల ఇనుము, ఉక్కు, 2.5 లక్షల ఘనపు టన్నుల కాంక్రీట్, ఇసుక వినియోగించారు.
* విగ్రహ నిర్మాణానికి పదేళ్లు పట్టింది
* గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా విగ్రహం తట్టుకోగలదు
* 250 సంవత్సరాలపాటు చెక్కు చెదరకుండా ఉండేలా అత్యంత బలంగా నిర్మించారు
* విగ్రహ ప్రాంగణంలో బంగీజంప్, గో-కార్ట్ తదితర వినోద, సాహస క్రీడల సదుపాయాలు ఉన్నాయి